Probationary IPS Officers Controversial Behavior in Telangana : ఎన్నికల సమయంలో హైదరాబాద్‌కు కీలకమైన విభాగానికి బదిలీపై వచ్చిన ఓ ఐపీఎస్ అధికారిణి భారీగా వసూళ్లు మొదలపెట్టారు. ఎక్కడ డ్యూటీ చేసినా అక్కడ విల్లాల ధరలు గురించి ఆరా తీస్తుండటంతో కిందిస్థాయి సిబ్బంది ఆమెను విల్లా రాణిగా పిలుస్తారు. ఆమెపై ఆరోపణలు రావడంతో హైదరాబాద్‌లోని కీలకస్థానం నుంచి మరో ప్రాంతానికి బదిలీ చేశారు. అక్కడా కూడా ఆమె తీరు మారకపోవడంతో చర్యలు తీసుకునేందుకు సర్కారు సన్నద్ధమవుతోంది.
అవినీతితో బోణీ :ఇదిలా ఉండగా మల్టీజోన్-2లో ఓ జిల్లా ఎస్పీగా నియమితులైన యువ ఐపీఎస్ కూడా ఎన్నికల కోసం ప్రభుత్వం మంజూరు చేసిన నిధులన్నీ ఖర్చు చేసినట్లు చూపి అవినీతికి బోణీ చేశారు. ఆ తర్వాత ఖర్చుల కోసం కిందిస్థాయి సిబ్బందిపై తీవ్ర ఒత్తిడి తెచ్చారు. దీంతో ఆ ఐపీఎస్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఓ అప్రాధాన్య పోస్టుకు బదిలీ చేసింది. అంతకముందు సైబరాబాద్‌లో పనిచేసినప్పుడు ఆయన ఇలానే వసూలు చేసేవారని విచారణలో బయటపడింది.
ఇండియన్ పోలీస్ సర్వీస్(ఐపీఎస్) అఖిలభారత స్థాయిలో అత్యున్నత సర్వీస్. శాంతిభద్రతల పరిరక్షణతోపాటు చట్టాల అమలులో వీరిది ముఖ్య భూమిక. అలాంటి ఉన్నత స్థానంలో ఉన్న ఐపీఎస్‌లలో కొందరి తీరు రాష్ట్రంలోనే వివాదాస్పదంగా మారింది. ముఖ్యంగా కొత్తగా నియమితులైన కొందరు యువ ఐపీఎస్‌లు వసూళ్ల కోసమే అడ్డదారులు తొక్కుతుండటంతో ముక్కున వేలేసుకునేలా చేస్తోంది. ఈ నేపథ్యంలో డ్యూటీలో చేరకముందే వసూళ్లు మొదలుపెట్టిన ఓ ఐపీఎస్‌కు ప్రభుత్వం ఛార్జిమెమో ఇచ్చింది. ఈ తరహాలో ఆరోపణలు ఎదుర్కొంటున్న పలువురిని సైతం అప్రాధాన్య పోస్టుల్లోకి బదిలీ చేసింది. తప్పు చేసేవారిని ఎట్టిపరిస్థితుల్లో ఉపేక్షించవద్దని రాష్ట్ర ప్రభుత్వం ఉన్నతాధికారులకు స్పష్టం చేసింది.
భూవివాదాల్లో తలదూర్చి : తెలంగాణ కేడర్‌కు కేటాయించిన ఓ మహిళా ఐపీఎస్, ప్రొబేషనరీగా రాష్ట్రంలోని ఓ జిల్లాలో డ్యూటీ చేస్తూ సైబరాబాద్ కమిషనరేట్‌లోని ఓ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లారు. ఆ ఠాణా తన పరిధిలో లేకపోయినా సరాసరి స్టేషన్‌హౌస్ ఆఫీసర్ సీట్లో కూర్చొని, ఓ భూవివాదానికి సంబంధించి కేసు ఫైల్ తెమ్మని సిబ్బందిని ఆదేశించారు. ఆ సమయంలో ఆ ఐపీఎస్‌తో అదే వివాదంపై ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి సైతం ఉండటం గమనార్హం. ఇలా కేసు ఫైల్ తేవడం నిబంధనలు ఒప్పుకోవని సిబ్బంది చెప్పినా ఆమె వినలేదు. తాను ఐపీఎస్‌నని, తన భర్త ఐఏఎస్ అని, తాము అనుకుంటే ఏమైనా చేస్తామని సిబ్బందిని బెదిరించారు. ఈ క్రమంలో కష్టం మీద స్టేషన్ సిబ్బంది ఆమెను అక్కడి నుంచి పంపించారు. ఈ విషయం ఉన్నతాధికారులకు తెలియడంతో ఆమెకు ఛార్జిమెమో ఇచ్చారు.