Toxic Gases Released in Science Lab at Bapatla :ఏపీలోనిబాపట్ల జిల్లా సూర్యలంక వాయుసేనా కేంద్రం ఆవరణలోని కేంద్రీయ విద్యాలయలో 25 విద్యార్థులు అస్వస్థతకు గురికావడం తీవ్ర కలకలం రేపింది. స్కూల్లోని సైన్స్ ఉపాధ్యాయురాలు సుజాత క్లోరోఫిల్ ఆమ్లం, నిమ్మ ఉప్పుతో ఓ ప్రయోగాన్ని విద్యార్థుల ఎదుట ప్రదర్శించారు. ఆమె బయటకు వెళ్లగానే నవ్య శ్రీ అనే విద్యార్థిని కాఫీపొడితో పాటు సాల్ట్, శానిటైజర్, పంచదారను ఉపాధ్యాయురాలు తయారు చేసిన మిశ్రమానికి కలిపారు. దీంతో వాయువులు ఆరో తరగతి గదితో పాటు ఎదురుగా ఉన్న ఏడో క్లాస్ గదిలోకి వ్యాపించాయి.
విషవాయువులు పీల్చిన 25 మంది విద్యార్థులు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. పలువురు స్పృహ తప్పారు. వెంటనే అప్రమత్తమైన టీచర్లు వాయుసేనా కేంద్ర ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స చేయించారు. తర్వాత మెరుగైన వైద్యం కోసం బాపట్ల జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. విద్యార్థులకు చికిత్స అందిచడంతో 23 మంది కోలుకున్నారు. ఒక విద్యార్థి షణ్ముఖకు గుండె సమస్య ఉన్నట్లు ఈసీజీలో డాక్టర్లు గుర్తించారు. మెరుగైన వైద్యం కోసం షణ్ముఖను గుంటూరులోని ఆస్పత్రికి అధికారులు తక్షణమే తరలించారు. మరో విద్యార్థిని మాధురికి ఫీవర్ రావడంతో వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు.
విద్యార్థులను పరామర్శించిన అదనపు కలెక్టర్ : టాక్సిక్ గ్యాస్ వెలువడటానికి కారణమైన మిశ్రమాన్ని విద్యాలయ ప్రిన్సిపల్ వైద్యశాల సూపరింటెండెంట్ సిద్ధార్థకు అందజేశారు. కెమికల్ మిశ్రమాన్ని పరీక్షల నిమిత్తం గుంటూరులో ప్రయోగశాలకు పంపించారు. జాయింట్ కలెక్టర్, బాపట్ల తహసీల్దార్ ఆస్పత్రికి వచ్చి స్టూడెంట్స్ను పరామర్శించారు. సూర్యలంక వాయుసేనా కేంద్రం కమాండర్, గ్రూప్ కెప్టెన్ శ్రీవాస్తవ ప్రాంతీయ ఆసుపత్రికి వచ్చి సూపరింటెండెంట్ సిద్ధార్థతో మాట్లాడి విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.