Manchu Manoj Meet Additional DGP : మంచు కుటుంబంలోని వివాదాలు పరస్పర ఫిర్యాదులతో రచ్చకెక్కాయి. మోహన్‌బాబు ఫిర్యాదు మేరకు హైదరాబాద్ పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్లో మనోజ్‌పై కేసు నమోదైంది. ఇవాళ పెద్దమనుషుల సమక్షంలో జరిగిన మోహన్‌బాబు, విష్ణు, మనోజ్ మధ్య జరిగిన చర్చలు విఫలం అయ్యాయి. ఇది ఆస్తికోసం కాకుండా ఆత్మగౌరవం కోసం చేస్తున్న పోరాటమని మనోజ్ తెలిపారు. తన భార్య మౌనికతో కలిసి అదనపు డీజీపీ మహేశ్ భగవత్‌ని కలిశారు. న్యాయం కోసం స్టేషన్లో ఫిర్యాదు చేస్తే పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు ప్రాణహాని ఉందని, భద్రత కల్పించాలని వారు అదనపు డీజీపీకి విజ్ఞప్తి చేశారు.
రంగారెడ్డి జిల్లా జల్‌పల్లిలోని మంచు మోహన్ బాబు ఇంటి వద్ద ఉదయం నుంచి హైడ్రామా నెలకొంది. న్యాయం చేయాలంటూ మనోజ్ అదనపు డీజీపీ మహేశ్ భగవత్‌ని కలిసే వరకు పరిస్థితులు దారితీశాయి. ఇంట్లో ఉండగా గుర్తుతెలియని వ్యక్తులు తనపై దాడికి యత్నించారని మనోజ్ పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కుమారుడు మనోజ్‌తో పాటు ఆయన భార్య మౌనికతో తనకు హాని ఉందని రాచకొండ కమిషనర్‌తో పాటు పహాడీషరీఫ్ పీఎస్‌లో మోహన్ బాబు సైతం ఫిర్యాదు చేశారు. ఇరువురి ఫిర్యాదులను స్వీకరించిన పోలీసులు కేసులు నమోదు చేశారు.
చర్చలు విఫలం : అయితే నిన్న పెద్ద మనుషుల సమక్షంలో మోహన్ బాబుకు, మనోజ్‌కు మధ్య జరిగిన చర్చలు విఫలం అయ్యాయి. ఈ నేపథ్యంలో ఇరువురు స్టేషన్లో పరస్పరం ఫిర్యాదులు చేశారు. తాజాగా ఇవాళ విదేశాల నుంచి తిరిగి వచ్చిన పెద్ద కుమారుడు విష్ణుకు మోహన్ బాబు ఎయిర్‌పోర్ట్‌లో స్వాగతం పలికి ఇంటికి తీసుకొచ్చారు. అనంతరం సన్నిహితుల సమక్షంలో మోహన్ బాబు, విష్ణు, మనోజ్ సమస్య పరిష్కారానికి చర్చలు జరిపారు. ఈ క్రమంలోనే కాసేపటికి ఉన్నపళంగా చర్చల మధ్యలోంచే భార్య మౌనికతో పాటు బౌన్సర్లను తీసుకొని మనోజ్ బయటకు వచ్చారు.
చర్చల సమయంలో తన భార్యతో పాటు తన బౌన్సర్లను బయటకు పంపే ప్రయత్నం చేశారని మనోజ్ మీడియాకు తెలిపారు. పోలీసులు సైతం తనకు రక్షణ కల్పిస్తామని నమ్మబలికి తన బౌన్సర్లనే బెదిరించారని మనోజ్ వివరించారు. పోలీసుల ఏకపక్ష ధోరణిని ఖండిస్తున్నానని స్పష్టం చేశారు. ఈ వివాదంలో తన భార్యతో పాటు 7 నెలల కుమార్తెను లాగడం అమానుషం అంటూ మనోజ్ ఆవేదన వ్యక్తం చేశారు.