తెలంగాణ

telangana

ETV Bharat / state

మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుపై కేసు వేసిన వ్యక్తి దారుణ హత్య - రంగంలోకి సీఎంవో - MEDIGADDA COMPLAINANT MURDERED

భూపాలపల్లిలో వార్డు మాజీ కౌన్సిలర్​ భర్త రాజలింగమూర్తి దారుణహత్య - కత్తులు, గొడ్డళ్లతో నరికి చంపిన ఆగంతకులు - ఆయనపై గతంలో భూతగాదా కేసులు నమోదు - రాజలింగమూర్తి హత్యపై సీఎంవో ఆరా

Medigadda Complainant Murdered
Medigadda Complainant Murdered (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Feb 20, 2025, 10:31 AM IST

Medigadda Complainant Murdered : కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడానికి బీఆర్ఎస్​ ప్రభుత్వమే కారణమని కేసు వేసిన భూపాలపల్లికి చెందిన రాజలింగమూర్తి(47) దారుణ హత్యకు గురయ్యారు. బుధవారం రాత్రి 7.15 గంటల సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు కత్తులు, గొడ్డళ్లతో ఆయనను నరికి చంపారు. ఈయనపై గతంలో భూ వివాదాల విషయమై పలు కేసులు నమోదయ్యాయి. కాగా హత్యకు పూర్తి వివరాలు తెలియరాలేదు. ఘటనపై ఇంకా తమకు ఫిర్యాదు అందలేని పోలీసులు తెలిపారు. మరోవైపు రాజలింగమూర్తి హత్యపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు. ఇందుకు గల కారణాలపై నిఘా వర్గాల నుంచి సీఎంవో సమాచారం కోరారు.

బాధితుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం,రాజలింగమూర్తి వార్డు మాజీ కౌన్సిలర్​ అయిన నాగవెళ్లి సరళ భర్త. ఆమె 2019లో జరిగిన పురపాలక ఎన్నికల్లో భూపాలపల్లి లోని 15వ వార్డు నుంచి బీఆర్ఎస్​ తరఫున కౌన్సిలర్‌గా గెలుపొందారు. కొద్ది నెలల తర్వాత నాగవెళ్లి సరళను బీఆర్ఎస్​ పార్టీ నుంచి బహిష్కరించారు. ఈ నెల 19వ తేదీన రాజలింగమూర్తి తన స్వగ్రామం జంగేడు శివారు పక్కీరుగడ్డలో సోదరుల ఇంట్లో జరిగిన ఓ శుభకార్యానికి వెళ్లి బైక్​పై భూపాలపల్లికి తిరిగి వస్తున్నాడు.

సరిగ్గా తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఎదురుగా రోడ్డును దాటుతున్న క్రమంలో 4 నుంచి ఐదుగురు గుర్తు తెలియని వ్యక్తులు మంకీ క్యాపులను ధరించి ఆయన్ను చుట్టుముట్టారు. ఒక్కసారిగా కత్తులు, గొడ్డళ్లతో విచక్షణా రహితంగా దాడి చేశారు. తలకు బలమైన గాయంతో పాటు కత్తిపోట్ల కారణంగా అతడి ప్రేగులు బయటకు వచ్చేశాయి. స్థానికులు వెంటనే దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆయన మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు.

భూ తగాదాలే కారణమా? : రాజలింగమూర్తి 2 దశాబ్దాలుగా వరంగల్‌కు చెందిన ఓ ప్రముఖ న్యాయవాది ద్వారా భూ సమస్యలను పరిష్కరించేవారు. రాజలింగమూర్తిపై గతంలో పలు కేసులు కూడా నమోదయ్యాయి. ఓపెన్‌కాస్ట్‌ గనుల తవ్వకాలతో పర్యావరణం దెబ్బతింటోందని సింగరేణిపై ఎన్​జీటీ( నేషనల్‌ గ్రీన్‌ ట్రైబ్యునల్‌)లో ఆయన ఫిర్యాదు చేశారు.

తన భర్త దారుణహత్యకు మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, మాజీ సర్పంచ్​ బుర్ర చంద్రయ్య, వార్డు మాజీ కౌన్సిలర్‌ కొత్త హరిబాబు కారణమని, వారిపై చర్యలు తీసుకోవాలని రాజలింగమూర్తి భార్య సరళ, కుటుంబ సభ్యులతో కలిసి పట్టణంలోని అంబేడ్కర్‌ కూడలిలో నేషనల్​ హైవేపై బుధవారం రాత్రి బైఠాయించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు డిమాండ్‌ చేశారు.

రాజలింగమూర్తి హత్యపై సీఎంవో ఆరా :భూపాలపల్లిలో దారుణహత్యకు గురైన రాజలింగమూర్తి హత్యకు గల కారణాలపై నిఘావర్గాల నుంచి సీఎంవో సమాచారం కోరింది. మేడిగడ్డ కుంగుబాటుపై కేసు వేసిన వ్యక్తి హత్యపై ముఖ్యమంత్రి కార్యాలయం(సీఎంవో) ఆరా తీసింది.

మేడ్చల్‌లో దారుణం - వెంటాడి, వేటాడి అన్నను హత్య చేసిన సొంత తమ్ముళ్లు

ప్రేమ కోసం దారుణం - నడిరోడ్డుపై ఆటో డ్రైవర్​ను హత్య చేసిన మరో డ్రైవర్

ABOUT THE AUTHOR

...view details