Man Suicide after Released from Jail in wife murder case : మనస్పర్థల వల్ల భార్యను హత్య చేశానని పశ్చాత్తాపం, గ్రామంలో తలెత్తుకు తిరగలేని పరిస్థితి.. ఈ నేపథ్యంలో ఓ భర్త అత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్లో చిత్తురు జిల్లా రామకుప్పం మండల పరిధిలో ఆదివారం జరిగింది. రామకుప్పం ఎస్సై వెంకట మోహన్ వెల్లడించిన వివరాల ప్రకారం పదేళ్ల క్రితం బైపరెడ్లపల్లికి చెందిన గంగిరెడ్డి, సుజాత దంపతులకు వివాహం జరిగింది. బతుకుదెరువు కోసం బెంగళూరుకు వెళ్లిన ఆ దంపతులు అక్కడే కూరగాయల వ్యాపారం పెట్టి జీవనం సాగించేవారు.
ఈ నేపథ్యంలో ఆరు నెలల క్రితం దంపతుల మధ్య మనస్పర్థల ఏర్పడి గొడవ జరిగింది. ఈ క్రమంలో క్షణికావేశానికి గురైన గంగిరెడ్డి తన భార్య సుజాతపై కత్తితో దాడి చేశాడు. దీంతో ఆమె మృతి చెందింది. బెంగళూరులోనే గంగిరెడ్డి పోలీసులకు లొంగిపోగా ఆరు నెలలు జైలుశిక్ష అనుభవించి శనివారం బెయిల్‌పై విడుదలయ్యాడు. ఈ క్రమంలో శనివారం రాత్రి స్వగ్రామం వచ్చిన గంగిరెడ్డి, పిల్లలతో కలిసి భోజనం చేశాడు. అదివారం ఉదయం లేచిచూసే సరికి తండ్రి కనిపించకపోవడంతో చుట్టుపక్కల గాలించారు. చివరకు భార్య సుజాత సమాధి వద్ద చెట్టుకు గంగిరెడ్డి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుని కనిపించాడు.