Lorry Hit Two Wheeler Person Killed in Warangal District : ఒక కాకి చనిపోతేనే వందలాది కాకులు కావ్.. కావ్.. మంటూ ఆ కాకి దగ్గరు వచ్చి చేరుతాయి. అలాగే ఒక కుక్క చనిపోతే.. తోటి శునకాలు వచ్చి కన్నీళ్లు పెట్టుకుంటాయి. ఒక గోవు చనిపోతే.. తోటి గోవులు వచ్చి మౌనంగా ఉంటూ బాధపడతాయి. ఇవన్నీ ప్రాణం ఉన్న పక్షులు, జంతువులు. కానీ జంతువుల కన్నా ఎంతో మేదస్సు గలవాడు మానవుడు. కానీ ఆ మనిషిలో మానవత్వం నానాటికీ దూరమైపోతుంది. తోటి వ్యక్తికి సాయం చేయాలన్న భావనే మరిచి.. అత్యవసర సమయాల్లో కూడా ఆదుకోవడం మరిచిపోతున్నాడు. ఒక మనిషి చనిపోతే పక్కనుంచి చూస్తూ, సిగ్గు లేకుండా వీడియోలు తీస్తూ వెళ్లిపోతున్న మనుషులు కొందరు మన మధ్య ఉంటున్నారు.
అలాంటి వారిని చూస్తే వీరి కన్నా జంతువులే నయం రా.. నాయనా అన్న ఫీలింగ్ ఏ ఒక్కరికైనా కలుగుతుంది. ఒక మనిషి చనిపోతే తను పెంచుకున్న కుక్క సైతం బాధపడుతుంది.. అలాంటిది మనిషికి మనిషే సాటిలేడు ఈ రోజుల్లో. రహదారి పక్కన రోడ్డు ప్రమాదం జరిగి ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారి.. ప్రాణాలు కాపాడాలన్న కనీసం మానవత్వం మరిచిపోయారు. కనీసం వారిపట్ల దయ తలస్తే ఒక నిండు ప్రాణానికి మరో జన్మనిచ్చిన వారు అవుతారన్న విషయాన్ని ఆదమరుస్తున్నారు. అందుకే ఏనాడో చెప్పారు మహానుభావులు మాయమైపోతున్నడమ్మా.. మనిషిన్న వాడు అనీ.
ప్రాణాలు కాపాడాలని ప్రాధేయపడుతున్న బాధితుడు (ETV Bharat) తాజాగా కీసర అవుటర్ రింగు రోడ్డు వద్ద బుధవారం జరిగిన ఘటన. రోడ్డు ప్రమాదంలో బాధితుడి రెండు కాళ్లు నుజ్జునుజ్జయ్యాయి. తీవ్ర రక్తస్రావం అవుతుంది.. ఆసుపత్రికి తీసుకెళ్లండి అంటూ ఆ వ్యక్తి ఎంత ప్రాధేయపడినా చుట్టూ ఉన్న జనం సాయం చేయలేదు. 108 వాహనం వచ్చేవరకూ.. ఫొటోలు, వీడియోలు తీసుకుంటూ కాలం వెల్లబుచ్చారే కానీ ఓ నిండు ప్రాణాన్ని కాపాడాలన్న ఆలోచన వారిలో కలగలేదు. ఇంకేముంది 108 అంబులెన్స్ వచ్చి ఆ వ్యక్తిని సమీప ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే ప్రాణం పోయింది. ఈ దుర్ఘటనలో మృతుడిని సకాలంలో ఆసుపత్రికి తీసుకెళ్లి ఉంటే కాళ్లు పోయిన జీవితాంతం బతికేవాడేమో.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, వరంగల్‌కు చెందిన వి. ఏలేందర్ కీసర సమీప రాంపల్లి చౌరస్తాలో నివాసం ఉంటున్నారు. ఏలేందర్‌కు భార్య, ఇద్దరు చిన్న పిల్లలు. బుధవారం సాయంత్రం కీసరలో తాను నిర్మిస్తున్న ఇంటిని చూసేందుకు స్కూటీపై వెళుతుండగా.. వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొట్టిగా ఆయన రోడ్డుపై పడిపోయాడు. స్థానికులు గమనించి కేకలు వేసేసరికి డ్రైవర్ లారీని ఒక్కసారిగా రివర్స్ చేయడంతో లారీ చక్రాలు ఎలేందర్ కాళ్లపై నుంచి వెళ్లి నుజ్జునుజ్జయ్యాయి. తీవ్ర రక్తస్రావంతో విలవిల్లాడుతున్న ఏలేందర్.. తనను వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాలని ప్రాధేయపడ్డాడు. చుట్టూ పోగైన జనం చూస్తున్నారే తప్పితే ఆసుపత్రికి తీసుకెళ్లాలన్న ఆలోచన రాలేదు. 108కు సమాచారం అందించి బాధితుడి ఫొటోలు, వీడియోలు తీస్తూ ఉండిపోయారు. కాసేపటికి 108 రాగా ఈసీఐఎల్ చౌరస్తాలోని ఓ ఆసుపత్రికి తీసుకెళ్లేలోగా బాధితుడు మృతి చెందాడు. లారీ డ్రైవర్ లక్ష్మణ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.
తల్లి ఎంత ప్రాధేయపడిన కనికరించని జనాలు : ఈ మధ్యనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయనగరం జిల్లా కేంద్రంలో ట్రాక్టర్ ఢీకొని ఓ వ్యక్తి ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు.. అతడిని ఆ సమయంలో ఆసుపత్రికి తీసుకెళితే ప్రాణాలు తగ్గేవే. కానీ అక్కడ ఉన్న జనాలు చూస్తూ వీడియోలు, ఫొటోలు తీసుకున్నారు తప్పిస్తే కాపాడాలన్న మానవత్వం మరిచారు. ఆ తల్లి మా అబ్బాయిని కాపాడండి బాబూ.. అని ఎంత వేడుకున్నా .. అక్కడ ఉన్న మనుషులు చూస్తూ మనకెందుకులే అని వారి పనులు వారు చేసుకున్నారు తప్పితే ఓ నిండు ప్రాణాన్ని కాపాడాలన్న ఆలోచన రాలేదు. దీని అంతటికీ కారణం మానవుడిలో రోజురోజుకీ నశిస్తున్న మానవత్వం.. తానే బాగుండాలని స్వార్థం తప్ప.. పక్కవాడు ఏం అయిపోయినా మనకెందుకులే అన్న భావనలో ఉంటున్నాడు.
ఊరంతా ఒక్కటై అంత్యక్రియలు నిర్వహించారు - ఎవరికో తెలిస్తే షాక్ అవుతారు
మంటగలిసిన మానవత్వం - ప్రమాదంలో డ్రైవర్ చనిపోతే - పాల కోసం ఎగబడిన ప్రజలు! - Ghaziabad Milk Van Viral Video