Mallanna Sagar Project Sub Canal Distributary Water Issue :సిద్దిపేట జిల్లా దుబ్బాక పురపాలికలోని మల్లయ్య పల్లి శివారులో మల్లన్న సాగర్ జలాశయ 14.5 కిలోమీటర్ల ఉప కాలువ 4 ఎల్ డిస్ట్రిబ్యూటరీ కాలువకు గండి పడింది. కాలువ నీటి ప్రవాహానికి కొట్టుకుపోయింది. ఫలితంగా యాసంగి కోసం వదిలిన గోదావరి జలాలు వృథాగా పోతున్నాయి. యాసంగి సీజన్‌లో సాగునీరు అందించడానికి ప్రభుత్వం ఇటీవల నీటిని విడుదల చేసింది. ఈ క్రమంలో బలవంతపూర్, చెల్లాపూర్, మల్లయ్యపల్లి, కమ్మర్ పల్లి, పోతారం, అచ్చుమాయపల్లి, గంభీర్ పూర్ గ్రామాల మీదుగా కాలువ ద్వారా సాగునీరు అందుతుంది. కాలువను కొంతమంది దుండగులు కావాలనే ధ్వంసం చేశారని ఆయా గ్రామాలకు రైతులు ఆరోపిస్తున్నారు.
మరికొంతమంది రైతులు మాత్రం బలహీనమైన ఆనకట్ట, నీటి ప్రవాహం తాకిడికి కాలువ కొట్టుకుపోయిందని వాదిస్తున్నారు. ఈ విషయమై నీటిపారుదల శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ చేపడతామన్నారు. గోదావరి నీళ్లు ఉధృతంగా ప్రవహించడంతో దుబ్బాక - మల్లయ్యపల్లి గ్రామాల మీద మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. రాకపోకలను మళ్లించడానికి స్థానిక పోలీసులు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.