Mallanna Sagar 14 Village People Facing Problems :మల్లన్న సాగర్ 50 టీఎంసీల సామర్థ్యంతో నిర్మాణం చేపట్టిన ఈ జలాశయం కాళేశ్వరం ప్రాజెక్టులోనే అతిపెద్దది. దీని నిర్మాణానికి దాదాపు 17 వేల ఎకరాల భూమిని గత ప్రభుత్వం సేకరించింది. మల్లన్నసాగర్ జలాశయంలో 14 గ్రామాలు ముంపునకు గురయ్యాయి. దీంతో వారంతా పుట్టి పెరిగిన ఊరును ఉన్న ఫలంగా ఖాళీ చేశారు. వారందరికీ పునరావాసం సహా మరెన్నో హామీలను నాటి ప్రభుత్వం ప్రకటించింది. కాగా ఆ హామీలన్నీ నీటి మూటలుగా మారడంతో వారంతా అనేక ఇబ్బందులు పడుతున్నారు. నిర్వాసితుల్లో ఏ ఒక్కరిని పలకరించినా కంట కన్నీళ్లే దర్శనమిస్తున్నాయి. తరతరాలుగా ఉన్న భూమిని చమటోడ్చి, కట్టుకున్న ఇళ్లను వదిలిన వారంతా ఎక్కడో ఊరు కాని ఊర్లో బతకాల్సిన పరిస్థితి. ఇంత చేసిన వారికి ప్రభుత్వ సహాయ సహకారాలు అందాయా అంటే అదీ లేదు.
సాగు చేసుకుందామంటే భూమి లేక, చేసుకుందామంటే ఉపాధి కానరాక, తలదాచుకుందామంచే సరైన గూడూ లేక పిల్లలకు విద్యాబుద్దులు నేర్పేందుకు కనీసం స్కూళ్లు లేక ఇలా అనేక సమస్యలతో జీవనం సాగిస్తున్నారు. తమ గ్రామం పేరు గుర్తొస్తేనే ఆనాటి జ్ఞాపకాలు, వారి పల్లెవాతారణనాన్ని గుర్తు చేసుకుని తల్లడిల్లి పోతున్నారు మల్లన్నసాగర్ నిర్వాసితులు. సిద్దిపేట జిల్లాలో కొమురవెల్లి మల్లన్నసాగర్ జలాశయ నిర్మాణానికి పరివాహక ప్రాతంలోని 14 గ్రామాల్ని ఖాళీ చేయించారు. ఒక్కో కుటుంబానికి ఒక్కో విధంగా ప్రభుత్వం ఆదుకుంటుందని ఆనాటి ప్రజాప్రతి నిధులు హామీల వర్షం కురిపించారు. సాగుభూమి కోల్పోయిన వారికి ప్రభుత్వ అంచనాల ప్రకారం ధర నిర్ణయించారు. వాస్తవానికి అక్కడ ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే దాదాపు మూడింతలు అధికంగా ధర ఉంటుంది. కానీ, ప్రాంత అభివృద్ధితో పాటు తోటి రైతులకు మేలు జరుగుతుందని భావించిన నిర్వాసితులు వారి భూముల్ని ప్రభుత్వానికి అప్పగించారు. ఆ డబ్బుల కోసమూ ఏళ్ల పాటు అధికారుల చుట్టూ తిరగారు.
Mallanna Sagar People emotional over vacated Villages : భూమితో పాటు ఇళ్లు కోల్పోయిన వారికి కొత్తగా ఇళ్లు కట్టించి ఇస్తామని, అదొద్దు అనుకుంటే 250 గజాల ఇంటి స్థలం ఇస్తామని గత ప్రభుత్వం హామీ ఇచ్చింది. నిర్వాసితుల కుటుంబాల్లో 18 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరికీ ప్లాట్లు ఇస్తామని ప్రకటించింది. నూతనంగా నిర్మించిన ఇళ్లు అద్భుతంగా ఉంటాయని నమ్మబలికారు. ఒంటరి మహిళల కుటుంబ పోషణ కోసం ప్రత్యేక ప్యాకేజీని కేటాయించారు. ప్యాకేజీలో ఏడున్నర్ర లక్షల నగదు, ఇంటి స్థలం లేదా ఇల్లు కట్టించి ఇస్తానని పేర్కొన్నారు. కానీ, ఆ ప్యాకేజీలు నేటికీ చాలా మందికి అందనే లేదని నిర్వాసితులు చెబుతున్నారు. భూములు, ఇళ్లు, చెట్టు, పుట్ట ఇలా సర్వం కోల్పోయిన తమకు మూడేళ్లయినా గత పాలకులు ఇళ్లు ఇవ్వలేకపోయారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మల్లన్నసాగర్ పరివాహక ప్రాంతంలో మెుత్తం 14 గ్రామాలు ఖాళీ చేయించగా ప్రాజెక్టులో పాక్షికంగా ముంపునకు గురైన గ్రామాల కుటుంబాలు అక్కడే నివాసిస్తున్నాయి. మల్లన్న సాగర్‌లో ముంపునకు గురైన గ్రామాల వివరాలు పరిశీలిస్తే ఎర్రవెల్లి గ్రామంలో మెుత్తం 553 కుటుంబాలు ఉండగా అందరినీ ఖాళీ చేయించారు. సింగారం 181, లక్ష్మాపూర్ 310, రాంపూర్ 220, వేముల ఘాట్ 689, బంజేరుపల్లి 79, పల్లెపహాడ్ 509, ఏటిగడ్డ కిష్టాపూర్ 463, మెుగులు చెరువు తండాలో 113 కుటుంబాలు ఇలా ఆయా గ్రామాల్లోని అన్ని కుటుంబాలను ఖాళీ చేయించారు. వారందరినీ గజ్వెల్ శివారులోని సంగాపూర్‌లో నిర్మించిన ఆర్ అండ్ ఆర్ కాలనీకి తరలించారు. గజ్వేల్-ప్రజ్ఞాపూర్ బల్దియా పరిధి సంగాపూర్-ముట్రాజ్‌పల్లి సమీపంలో దాదాపు 600 ఎకరాలు సేకరించిన గత ప్రభుత్వం తిరిగి గ్రామాలను పునర్ నిర్మించింది.