CBSE Internal Assessment Exam Result in AP : విద్యార్థులను పునాది స్థాయి నుంచి సన్నద్ధం చేయకుండా, ఉపాధ్యాయులకు కనీస శిక్షణ ఇవ్వకుండా గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సీబీఎస్ఈ పరీక్షా విధానం ఫలితాలు తిరోగమన దిశలో కన్పిస్తున్నాయి. గతంలో నాటి సీఎం జగన్ హడావిడిగా అమల్లోకి తెచ్చిన ఈ విధానం పర్యవసానాలకు ఓ తరం స్టూడెంట్స్ బలి కావాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.
సీబీఎస్ఈ అమలవుతున్న ప్రభుత్వ పాఠశాలల్లోని పిల్లల సామర్థ్యాలను అంచనా వేసేందుకు తాజాగా రాష్ట్ర విద్యాశాఖ పదో తరగతి విద్యార్థులకు అంతర్గత మదింపు ఎగ్జామ్స్ నిర్వహించింది. ఇప్పటివరకు బోధించిన సిలబస్ నుంచి 50 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలకు 50 మార్కుల చొప్పున కేటాయించారు. దీన్నే 100 మార్కులకు లెక్కకట్టారు. ఇందుకు 80,000ల ట్యాబ్‌లు వినియోగించారు. మొత్తం 77,478 మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాశారు.
అంతర్గత మదింపు పరీక్షల్లో విస్తుపోయే ఫలితాలు :వారిలో ఇంగ్లిషులో 59,518 (76.81 %), గణితంలో 56,213 (72.55 %), సామాన్య శాస్త్రంలో 49,410 (63.77 %), సోషల్ స్టడీస్‌లో 48,766 (62.94 %) మంది ఫెయిల్ అయ్యారు. ఏ సబ్జెక్టులోనూ కనీసం సగం మంది పాస్ కాలేదు. ఈ రిజల్ట్స్‌ను చూసి అధికారులు విస్మయానికి లోనయ్యారు. ఈ క్రమంలో ఈ ఏడాది 1000 పాఠశాలల్లో చదువుతున్న పదో తరగతి విద్యార్థులు సీబీఎస్ఈ విధానంలోనే పరీక్షలు రాయాల్సి ఉంది. అయితే తాజా మదింపు ఫలితాలే జరగబోయే పబ్లిక్ పరీక్షల్లోనూ పునరావృతమైతే పరిస్థితి ఏంటని వారు ఏపీ విద్యాశాఖ మంత్రి లోకేశ్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై ఓ నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించారు.
ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో? : సీబీఎస్ఈ విధానంలో పరీక్షలు రాసే స్టూడెంట్స్‌కు 20 ఇంటర్నల్ మార్కులు ఉంటాయి. ఇవి ఆయా పాఠశాలల టీచర్లు వేస్తారు. కాబట్టి విద్యార్థులందరికీ సుమారు 20 మార్కులు వేయొచ్చని, మరో 20 మార్కులు అదనంగా తెచ్చుకుంటే పాస్ అయిపోతారంటూ గత సర్కార్ ఆలోచించిందని అధికారులు ఇటీవల సమీక్షలో లోకేశ్ దృష్టికి తెచ్చారు. వాస్తవానికి విద్యార్థులందరికీ అంతర్గత మార్కులు గరిష్ఠంగా 20 మార్కులు వేయడానికి నిబంధనలు ఒప్పుకోవని కూడా వారే మంత్రికి తెలిపారు.
అంతా విన్న మంత్రి లోకేశ్, ఇది విద్యార్థుల భవిష్యత్‌కు సంబంధించిన విషయమని, ఇలాంటి వాటిని తాను అంగీకరించనన్నారు. సీబీఎస్ఈ పరీక్షలు రాసి, విద్యార్థులు పెద్ద ఎత్తున ఫెయిల్ అయితే, అది తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుందన్నారు. వారు ఎన్నో మానసిక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది. విద్యాశాఖకు సంబంధించి ప్రతి నిర్ణయమూ లోతుగా ఆలోచించి తీసుకోవాలని అధికారులకు ఆయన సూచించారు.