Major Fire Accident in Jeedimetla Plastics Industry : రాష్ట్ర రాజధాని హైదరాబాద్ జీడిమెట్ల పారిశ్రామికవాడలో మంగళవారంమధ్యాహ్నం సంభవించిన అగ్నిప్రమాదంలో ఎట్టకేలకు మంటలు అదుపులోకి వచ్చాయి. మంగళవారం రాత్రంతా శ్రమించిన అర్ధరాత్రి వరకు అగ్నిమాపక సిబ్బంది మంటలను నియంత్రించారు. భారీ పేలుళ్లు, పక్కన ఉన్న భవనాలకు వ్యాపించకుండా నియంత్రించారు. అయితే మంటలను పూర్తిగా నియంత్రించేందుకు మరి కొన్ని గంటల సమయం పట్టే అవకాశముందని తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం ఎస్ఎస్వీ పాలిథిన్ సంచుల తయారు చేసే మూడంతస్తుల పరిశ్రమలో భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. తొలుత పై అంతస్తులో చెలరేగిన మంటలు క్రమక్రమంగా భవనమంతటా వ్యాపించాయి.
జీడిమెట్ల పారిశ్రామికవాడలోని దూలపల్లి రహదారి పక్కనే ఉన్న ఎస్ఎస్వీ ప్లాస్టిక్ సంచుల తయారీ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. పరిశ్రమ భవనం మూడో అంతస్తులో చెలరేగిన మంటలు క్రమంగా కింది రెండంతస్తులకు వ్యాపించాయి. చూస్తుండగానే భవనం మూడో అంతస్తు అంతా అగ్ని కమ్మేసింది. భవనంలో పెద్ద ఎత్తున పాలిథిన్ కవర్లు, వాటి తయారీకి వాడే ముడిసరుకు నిల్వ ఉండడంతో మంటలు అంతకంతకు విస్తరించాయి. ప్రమాదం జరిగిన సమయంలో భవనంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. ఏడు అగ్నిమాపకశకటాలతో సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. 40 నీళ్ల ట్యాంకర్లతో మంటలు ఆర్పేందుకు తీవ్రంగా శ్రమించారు.
మంటల ధాటికి భవనం బీటలు :ఒక దశలో మంటలు ఆర్పుతున్న సమయంలో భవనం పక్కనే ఉన్న విద్యుత్ హైటెన్షన్ తీగలకు నీరు తగలడంతో అధికారులకు స్వల్పంగా విద్యుదాఘాతం తగిలింది. వెంటనే అప్రమత్తమై భవనం నుంచి బయటకు వచ్చేశారు. విద్యుత్ శాఖాధికారులను పిలిపించి హైటెన్షన్ తీగలకు ఉన్న విద్యుత్ సరఫరా నిలిపివేసి తిరిగి మంటలను అదుపు చేసే పనిలో నిమగ్నమయ్యారు. మంటల ధాటికి భవనం బీటలు వారింది. 10 గంటలుగా మంటలు ఎగిసిపడుతుండటంతో భవనం క్రమంగా కూలింది. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు.