Lay out Regularization Scheme Update : ఎల్ఆర్ఎస్ (లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీం) దరఖాస్తుల పరిష్కారంపై మున్సిపల్ కమిషనర్లు దృష్టి సారించాలని రాష్ట్ర పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిషోర్ ఆదేశించారు. మార్చి నెలాఖరులోగా ఎల్ఆర్ఎస్ సమస్యలు పరిష్కరించాలని సూచించారు. రాష్ట్రంలోని 142 పురపాలక సంఘాల కమిషనర్‌లతో మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో దాన కిషోర్ సమావేశమయ్యారు.
ఎల్ఆర్ఎస్, రెవెన్యూ, రెవెన్యూయేతర పన్ను వసూళ్ల లక్ష్యం, ఇప్పటి వరకు సాధించిన పన్నులు, మహిళా స్వయం సహాయక సంఘాల అంశాలపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. తప్పిదాలకు తావు లేకుండా ఎల్ఆర్ఎస్ ప్రక్రియను మార్చి నెెలలోగా పూర్తిచేయాలన్నారు. దరఖాస్తుదారులు భవన నిర్మాణ అనుమతులు తీసుకునేలా ప్రోత్సహించాలని సూచించారు. అర్హులైన ప్రతి మహిళను స్వయం సహాయక సంఘంలో చేర్పించాలని ప్రభుత్వం ఏజెండాగా పెట్టుకుందన్న విషయాన్ని గుర్తుచేశారు.
5 వేల కోట్లకు పెంచిన ప్రభుత్వం : మెప్మా పరిధిలోని స్వయం సహాయక సంఘాలకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 3 వేల కోట్లను బ్యాంక్ లింకేజి కింద ఇవ్వాలని లక్ష్యంగా నిర్దేశించుకుని, ఇప్పటి వరకు రూ. 2500 కోట్లను సంఘాలకు అందించామని తెలిపారు. దీని ఫలితంగా ప్రభుత్వం బ్యాంక్ లింకేజ్ లక్ష్యాన్ని రూ. 5వేల కోట్లకు పెంచిందన్నారు. మిగతా రూ. 2500 కోట్లను సంఘాలకు అందించేందుకు మున్సిపల్ అధికారులు కార్యాచరణ సిద్ధం చేయాలని ఆదేశించారు.