Heavy Rainfall Alert in AP : గత నెల భారీవర్షాలతో అతలాకుతలమైన ఆంధ్రప్రదేశ్‌ను మరో కొత్త సమస్య కలవరపెడుతోంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో కొత్తగా అల్పపీడనం ఏర్పడింది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా వెళ్తోంది. ఇది ఉత్తర తమిళనాడు, కోస్తా ప్రాంతంలో మరింత బలపడుతుంది. ఈ ప్రభావం వల్ల దక్షిణ కోస్తా కొన్ని జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసి అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.
ముఖ్యంగా నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో అతి భారీ వర్షాలు, కృష్ణ ,బాపట్ల జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని విశాఖ వాతావరణశాఖ ముఖ్య అధికారి కేవీఎస్ శ్రీనివాస్ ప్రకటించారు. వర్షాలు పడే సమయంలో దక్షిణ కోస్తాలో 35 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందని తెలిపారు. గడిచిన 24 గంటల్లో ఒంగోలులో 8 సెం.మీ, నెల్లూరు జిల్లా కందుకూరులో 5, విశాఖలో 2 సెంటిమీటర్ల వర్షపాతం నమోదయింది. ఈరోజు, రేపు నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేశారు. చిత్తూరు, కడప జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ అయింది. ఇవాళ్టి నుంచి రాబోయే నాలుగు రోజుల పాటు రాష్ట్రానికి వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
తీరంలో తీవ్ర తుపాన్ హెచ్చరికలు :ఈ ఏడాది బంగాళాఖాతంలో తుపాను తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ ముందే అంచనా వేసింది. సాధారణంగా అక్టోబరు, నవంబరు నెలల్లో ఏపీకి ఈ ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో దేశవ్యాప్తంగా ఏటా నైరుతి రుతుపవనాలు తిరోగమించి, ఈశాన్య రుతుపవనాలు ప్రవేశిస్తాయి. ఈ సమయంలో సముద్ర ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయి. ఈ పరిస్థితులు బంగాళాఖాతంలో అల్పపీడనాలు ఏర్పడటానికి అనుకూలంగా ఉండటంతో, అవి క్రమేపీ వాయుగుండాలు, తుపాన్లుగా మారతాయి.