Low Pressure in Bay of Bengal:పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో రానున్న 48 గంటల్లో కోస్తాంధ్ర అంతటా విస్తారంగా వర్షాలు కురుస్తాయని రాయలసీమలోనూ వానలు పడే సూచనలు ఉన్నాయని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. సముద్రంలో పరిస్థితి దృష్ట్యా రాష్ట్రంలోని తీర ప్రాంత పోర్టుల్లో 3వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని స్పష్టం చేశారు. తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయని విశాఖ వాతావరణ కేంద్రం ఇన్‌ఛార్జ్ డైరెక్టర్ కేవైఎస్ శ్రీనివాస్ అంటున్నారు.
ఈ జిల్లాల్లో వర్షాలు: రానున్న 12 గంటల్లో వాయువ్య దిశగా ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా తీరం వైపు వెళ్లే అవకాశం ఉంది. తదుపరి 24 గంటల్లో ఉత్తరం దిశగా ఏపీ తీరం వైపు పయనించే అవకాశం ఉంది. ఇవాళ శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి, విశాఖపట్నం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు తిరుపతి జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వివరించారు.
శుక్రవారం శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. పార్వతీపురం మన్యం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, బాపట్ల, నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.