Ganesh Immersion In Warangal: వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఇవాళ వినాయక నిమజ్జనం అంగరంగ వైభవంగా జరగనుంది. తొలి పూజలందుకునే గణపతి తొమ్మిది రోజుల పాటు భక్తుల చేత పూజలందుకుని కుడుములు, ఇతర నైవేద్యాలను ఆరగించి ఇవాళ గంగ చెంతకు బయలుదేరనున్నాడు. ఓరుగల్లులో ఈసారి గణపతి నవరాత్రులు ఆద్యంతం సందడిగా సాగాయి. విద్యుద్దీపకాంతులతో నగర వీధులు దేదీప్యమానంగా వెలిగిపోయింది.
జోరుగా నిమజ్జన ఏర్పాట్లు :గతంతో పోలిస్తే ఎక్కువగా విభిన్న గణపతులు కొలువుతీరాయి. ఇక వరంగల్‌లో 40 అడుగులతో తయారు చేసిన గణనాధుడు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. మండపాల వద్ద నిత్య పూజలతో పాటు భజనలతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. సరస్వతీ, లక్ష్మీ పూజల్లో వేలాదిగా భక్తులు పాల్గొన్నారు. మధ్యాహ్నం రాత్రి సమయాల్లోనూ మండపాల వద్ద అన్నదానాల కార్యక్రమాలను నిర్వహించారు.
పోయి రా గణపయ్య :ఇవాళ నిమజ్జనోత్సవం ప్రశాంతంగా జరిగేలా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. హనుమకొండ, వరంగల్, కాజీపేట పరిధిలో బంధం చెరువు, కోట మల్లన్న చెరువు, గుండం చెరువు బెస్తం చెరువు, చినవడ్డేపల్లి చెరువు, రంగం సముద్రం చెరువు సిద్దేశ్వర గుండం తదిరర 21 చెరువుల వద్ద నిమజ్జనోత్సవానికి ఏర్పాట్లు చేశారు.