Locals Clash With Panchayat Staff :ఆంధ్రప్రదేశ్లోని వైయస్సార్ కడప జిల్లాలో పందులు పట్టుకునే విషయమై పంచాయతీ సిబ్బంది, స్థానికులకు తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో ఓ వాహనం ధ్వంసమైంది. కాగా డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. సమాచారమందుకున్న పోలీసులు రంగంలోకి దిగడంతో పరిస్థితి సద్దుమణిగింది. పందులు ఉన్న వాహనాన్ని ఠాణాకు తరలించారు. అసలు అక్కడ ఏమైందంటే.
పందుల బెడదపై ఫిర్యాదులు :కడప జిల్లాలోని జమ్మలమడుగులో గత కొన్ని రోజులుగా స్థానికులు అనారోగ్యానికి గురవుతున్నారు. ఈ క్రమంలో నగర పంచాయతీ కమిషనర్ వెంకటరామిరెడ్డికి పట్టణ శుభ్రతపై కొన్ని కంప్లైంట్లు వచ్చాయి. దీంతో నగర పంచాయతీ సిబ్బంది పట్టణంలో క్లీనింగ్ పనులను నిర్వహించేందుకు చర్యలు చేపట్టారు. అయితే అక్కడే కొంత మంది స్థానికులు పందులను పెంచుకుంటున్నారు. ఆ పందులు పట్టణంలో సంచరించడం వల్ల రోగాలు ఎక్కువ అవుతున్నాయి. దీనిపై కూడా ఫిర్యాదులు అందాయి.
దీంతో నగర కమిషనర్ వెంకటరామిరెడ్డి ఆ పందుల యజమానులకు వాటిని పట్టణంలోకి వదలకూడదని నోటీసులు ఇచ్చారు. అవసరం అయితే పందులు పెంచుకునేందుకు ఊరి చివరన తగిన ఏర్పాట్లు కూడా చేస్తామని హామీ ఇచ్చారు. కానీ పందుల యజమానులు ఆయన మాటలను పట్టించుకోలేదు. దీంతో కమిషనర్ వారికి రెండు సార్లు నోటీసులను జారీ చేశారు. అయినా వారు పట్టించుకోకుండా పందులను అలానే పట్టణంలోనికి వదులుతున్నారు.