Lizard In Tiffin At TU Hostel :సాధారణంగా హోటళ్లలో తినే తిండిలో బొద్దింకలు, పురుగులు వస్తుండటం తరచూ వార్తల్లో చూస్తుంటాం. కానీ తెలంగాణ యూనివర్శిటీలోని వసతి గృహాల్లో విద్యార్థులకు పెడుతున్న ఆహారంలో కప్ప, బల్లి కీటకాల కళేబరాలు వెలుగు చూస్తున్నాయి. ఎన్నో ఆశలు, లక్ష్యాలతో ఉన్నత విద్యనభ్యసించాలని వర్సిటీలో అడుగుపెట్టిన విద్యార్థులు, ఇలాంటి ఘటనలతో భయాందోళనలకు గురవుతున్నారు.
విశ్వవిద్యాలయంలోని బాలికల హాస్టల్‌లో శుక్రవారం ఉదయం విద్యార్థులకు పెట్టిన అల్పాహారంలో బల్లి కళేబరం దర్శనమివ్వడం కలకలం రేపింది. ఈ విషయం బయటికి చెప్పకూడదని విద్యార్థినులకు హాస్టల్ అధికారులు హుకూం జారీ చేసినట్లు తెలిసింది. శనివారం ఈ విషయం బయటికి రావడంతో వర్సిటీ అధికారులు హైరానాకు లోనవుతున్నారు.
నాసిరకం సరకులు - పట్టింపులేని అధికారులు :వర్సిటీలోని హాస్టళ్లకు సరఫరా చేస్తున్న సరకులు తక్కువ నాణ్యతతో ఉంటున్నాయని, కుళ్లిన కూరగాయలు వస్తున్నాయని విద్యార్థులు వాపోతున్నారు. భోజనం రుచిగా ఉండటం లేదని వార్డెన్, కేర్ టేకర్లకు ఎన్నిసార్లు చెప్పినా అంటీముట్టనట్లు ఉంటున్నారని మండిపడుతున్నారు. కిచెన్, మెస్ హాళ్లలో అపరిశుభ్రత, ముఖ్యంగా బాలికల హాస్టల్లోకి పాములు, తేళ్లు లాంటి విషపు పురుగులు వస్తున్నాయని ఆందోళన చెందుతున్నారు.
నెలకు ఒక్క సారైనా తనిఖీలు నిర్వహించాలి :నూతన విద్యా సంవత్సరం ప్రారంభంలో వసతి గృహాల నిర్వహణపై వర్సిటీ అధికారులు సమీక్షలు జరిపి అంతటితో సరిపెట్టుకుంటున్నారు. నెలకోసారైనా హాస్టళ్లను తనిఖీలు చేయాలని విద్యార్థులు కోరుతున్నారు. కూరగాయలు, సరకులు, సరఫరా చేస్తున్న గుత్తేదారులు కొందరు అధికారుల చేతులు తడపడంతోనే హాస్టళ్లపై అశ్రద్ధ వహిస్తున్నారని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు.
Registrar Suspended The Head Cook :బాలికల వసతిగృహంలో అల్పాహారంలో బల్లి వచ్చిన ఘటనకు సంబంధించి హెడ్ కుక్ రాజేశ్‌ను సస్పెండ్ చేసినట్లు రిజిస్ట్రార్ ఆచార్య యాదగిరి తెలిపారు. హాస్టల్ సిబ్బంది విధులు సక్రమంగా నిర్వహించాలని, కిచెన్‌లో పరిశుభ్రత పాటించి నాణ్యమైన ఆహారం విద్యార్థులకు అందించాలన్నారు.