Liquor Sales in a Cart in Gachibowli :తోపుడు బండిలో మద్యం అమ్ముతున్న ఓ మహిళపై పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం ఆమె వద్ద ఉన్న 92 విస్కీ క్వార్టర్ సీసాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన గచ్చిబౌలి పోలీస్ పరిధిలో చోటు చేసుకుంది. కొండాపూర్ జేవీజీ హిల్స్ కాలనీలోని ఫుట్‌పాత్‌పై ఓ డబ్బాలో మద్యం అమ్మకాలు చేపడుతున్నారని స్థానిక ప్రజల ఫిర్యాదుతో శేరిలింగంపల్లి సర్కిల్ ఉప వైద్యాధికారి శ్రీకాంత్ రెడ్డి గురువారం ఉదయం 6.30 గంటలకు తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో 10 క్వార్టర్ సీసాలు లభించాయి. ఆ క్వార్టర్ సీసాలను ధ్వంసం చేసిన జీహెచ్‌ఎంసీ సిబ్బంది ఫుట్‌పాత్‌పై అక్రమంగా వేసిన డబ్బాను తొలగించారు.
సమీపంలోని రాజరాజేశ్వరి కాలనీలో సైతం ఇదే తరహాలో మద్యం అమ్ముతున్నట్లు స్థానిక ప్రజలు తెలియజేశారు. దీంతో శేరిలింగంపల్లి సర్కిల్ ఉప వైద్యాధికారి శ్రీకాంత్ రెడ్డి తన సిబ్బందితో వెళ్లి తనిఖీలు చేపట్టారు. తోపుడు బండిలో సిగరెట్లు అమ్ముతున్న ఓ మహిళ అదే బండిలో మద్యం అమ్మకాలు చేస్తున్నట్లు గుర్తించారు. ఈ సమాచారం అందుకున్న గచ్చిబౌలి పోలీసులు తోపుడు బండిలో ఉన్న మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆ మహిళను పోలీస్ స్టేషన్‌కు తరలించారు.