Landslide fell down in Tirumala Ghat Road :భారీ వర్షాల కారణంగా తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే ఘాట్‌రోడ్డులో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో స్వల్పంగా బండరాళ్లు రోడ్డుపై పడ్డాయి. దీంతో సిబ్బంది జేసీబీల ద్వారా వాటిని తొలగిస్తున్నారు. ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా టీటీడీ ముందుస్తు చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో భక్తలను శ్రీవారి పాదాలు, ఆకాశ గంగ, జాపాలి, పాపవినాశనానికి టీటీడీ అనుమతించడం లేదు. ఇప్పటికే తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలను కూడా రద్దు చేశారు. వర్షాల కారణంగా భక్తుల భద్రత మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు.
మరోవైపు హైదరాబాద్ నుంచి రేణిగుంటకు వస్తున్న విమానాన్ని చెన్నైకు దారి మళ్లించారు. భారీ వర్షాలతో తిరుపతి జిల్లాలో రేణిగుంట రన్‌వేపైకి భారీగా వరద నీరు చేరింది. దీంతో ల్యాండింగ్ సమస్య తలెత్తడంతో ఇండిగో విమానాన్ని చెన్నైకు దారి మళ్లించారు. భారీ వర్షంతో రేణిగుంట సమీపంలోని భగత్‌సింగ్ కాలనీ, జ్యోతిరావు ఫులే కాలనీలోకి వరద చేరింది. రేణిగుంట-మామండూరు మార్గంలో భారీ వృక్షం కూలింది. దీంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. రేణిగుంట మండలం ఎల్లమంద్యంలోని లోతట్టు ప్రాంతాల్లో కూడా భారీగా వర్షపు నీరు చేరింది. దీంతో ఎల్లమంద్యంలోని ఉన్న 15 కుటుంబాలను అధికారులు ఎంపీపీ పాఠశాలకు తరలించారు. తిరుపతి అర్బన్ పరిధిలో 17 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు.