Lands Encroachment Of YSRCP Leaders In Andhra Pradesh :ఆంధ్రప్రదేశ్లో వైఎస్సార్సీపీ పాలనలో మద్యం, ఇసుక కుంభకోణాలతో సమాంతరంగా ఆ పార్టీ నేతలు భూకబ్జాలకు పాల్పడ్డారు. ప్రతి జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ భూమి అనే తేడా లేకుండా ఆక్రమించేశారు. ఉమ్మడి విశాఖ, వైఎస్సార్ జిల్లాల్లో వేల కోట్ల విలువైన భూములు కొట్టేశారు. రికార్డుల్లో వివరాలు మార్చడంతో పాటు తప్పుడు పత్రాలు సృష్టించారు. కొన్నిచోట్ల వీరికి రెవెన్యూ అధికారులు, సిబ్బంది సహకరించారు. మా భూములు లాక్కుంటున్నారు న్యాయం చేయండంటూ కార్యాలయాల చుట్టూ తిరిగిన బాధితులను ఎవరూ పట్టించుకోలేదు. చివరికి భూములు వదులుకోవాలంటూ వైఎస్సార్సీపీ ముఠాల బెదిరింపులకు భయపడి కొందరు బలవన్మరణాలకు సైతం పాల్పడ్డారు.
ఉమ్మడి వైఎస్సార్ జిల్లాలో బద్వేలు, రాజంపేట, రాయచోటి నియోజకవర్గాల పరిధిలో వేల ఎకరాల ప్రభుత్వ భూములు గత ఐదేళ్లుగా అన్యాక్రాంతమయ్యాయి. బద్వేలులో సుమారు 5 వేల ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జాకు గురైనట్లు తెలుస్తోంది. కడప నగరంలో జిల్లా పరిషత్తుకు చెందిన రూ.4 కోట్ల విలువైన ప్రభుత్వ స్థలాన్ని వైఎస్సార్సీపీ కార్పొరేటర్ భర్త ఆక్రమించి హోటల్ ఏర్పాటు చేశారు. మామిళ్లపల్లెలో తెలుగుగంగ కార్యాలయానికి చెందిన 22 ఎకరాల భూమి ఆక్రమణల పాలైంది. సిద్దవటం మండలం భాకరాపేట శివారులోని కడప-చెన్నై జాతీయ రహదారి పక్కన ఎస్సీ లబ్ధిదారులకు చెందిన 6 ఎకరాల డీకేటీ భూమిని వైఎస్సార్సీపీ నేతలు 2020లో ఆన్లైన్లో తమ పేరుపైకి మార్చుకున్నారు.
రెండు కళ్లూ పొడిచేశారు! - విలువల విధ్వంసానికి ప్రతీకగా ప్రజావేదిక - SYMBOL OF DESTRUCTION IN AP
విశాఖలోనూ ఇదే దందా కొనసాగింది. సాగర నగరం చుట్టుపక్కల 500 ఎకరాల ప్రభుత్వ భూములు కాజేశారు. భీమిలి, ఆనందపురం, పద్మనాభం, పెందుర్తి, మధురవాడలో చెరువులు, వాగులను సైతం ఆక్రమించారు. రాణి వాద్వాన్కు చెందిన దస్పల్లా భూములు, సామాజిక సేవల కోసం కేటాయించిన హయగ్రీవ, సెయింట్లూక్స్ భూములు వైఎస్సార్సీపీ నేతల గుప్పెట్లోకి వెళ్లాయి. అంతటితో ఆగకుండా తమకు కావాల్సిన వారికి విలువైన ప్రభుత్వ భూములను తక్కువ ధరకు కట్టబెట్టారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల పేరుతో విశాఖ శారదా పీఠానికి 200 కోట్ల రూపాయల విలువైన భూమిని గత పాలకులు కేటాయించారు. పేద రైతులకు చెందిన 2 వేల ఎకరాల ఎసైన్డ్ భూములను అప్పటి ప్రభుత్వ పెద్దలు కొనుగోలు చేసినట్లు ఆరోపణలొచ్చాయి.
బాలినేని కుటుంబ సభ్యుల అండదండలతో:మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులరెడ్డి కుటుంబ సభ్యుల అండదండలతో ఒంగోలులో జరిగిన భూ దందా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనాన్ని సృష్టించింది. వందల కోట్ల విలువైన ప్రైవేట్ భూములకు నకిలీ పత్రాలు సృష్టించి రిజిస్ట్రేషన్ల పేరుతో కాజేశారు. బాధితుల ఆందోళనలతో అదనపు ఎస్పీ స్థాయి అధికారి పర్యవేక్షణలో 20 మంది సీఐలతో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. సుమారు 200 మంది నిందితులు ఉన్నట్లు గుర్తించగా, వారిలో కేవలం 70 మందినే అరెస్టు చేశారు. ప్రధాన సూత్రధారులపై ఇంతవరకు చర్యలు తీసుకోలేదు.
600 ఎకరాల్లో భారీ లేఅవుట్ :అనకాపల్లి జిల్లా కశింకోట మండలం బయ్యవరం రెవెన్యూ పరిధిలోని విస్సన్నపేటలో మాజీ మంత్రి అమర్నాథ్ అనుచరులు 600 ఎకరాల్లో భారీ లేఅవుట్ వేశారు. రైతుల నుంచి కొనుగోలు చేసిన భూములకు తోడు ప్రభుత్వ భూములు, వాగులు, కొండ గెడ్డలను సైతం అందులో కలిపేశారు. లేఅవుట్లోకి వెళ్లడానికి రోడ్డు కోసం రూ.5 కోట్ల విలువైన 10 ఎకరాల భూమి ఆక్రమించారు. ఈ వ్యవహారంపై అప్పటి ఆర్డీఓ సీతారాం విచారణ జరిపినా చర్యలు మాత్రం తీసుకోలేదు. శ్రీశైలానికి సమీపంలోని సున్నిపెంటలో జలవనరులశాఖకు చెందిన 208 ఎకరాల భూమి కబ్జాకు గురైనట్లు విజిలెన్స్ రిపోర్టుల్లో పేర్కొన్నా చర్యలు శూన్యం. నెల్లూరు గ్రామీణ నియోజకవర్గ పరిధిలో జలవనరులశాఖకు చెందిన కాలువలను ఆక్రమించి భారీ లేఅవుట్లను వేశారు.