KTR Slams Congress Govt :మహబూబ్‌నగర్ పట్టణంలోని పేదల ఇళ్ల కూల్చివేతలపై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ స్పందించారు. తెలంగాణను మరో "బుల్డోజర్ రాజ్ " కానివద్దని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేకు ఎక్స్ వేదికగా విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయం, చట్టాలనూ ఉల్లంఘిస్తూ పేదలకు గూడు లేకుండా చేసే ప్రయత్నాన్ని మీరు సమర్థిస్తున్నారా? అని కేటీఆర్ ప్రశ్నించారు. పేదల ఇళ్లను కూల్చకుండా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి సూచించాలని ఖర్గేను కోరారు.
పేదల ఇళ్లపై దుర్మార్గం :ఒకరి ఇంటిని కూల్చివేసి వారి కుటుంబాన్ని నిరాశ్రయులుగా మార్చటం అమానవీయం. అన్యాయం అంటూ గతంలో మీరే అన్నారని ఖర్గేను ఎక్స్‌లో ట్యాగ్ చేస్తూ కేటీఆర్ ప్రస్తావించారు. కాంగ్రెస్ అధినేత ఖర్గే మాటలను గుర్తు చేస్తూ ప్రశ్నించిన కేటీఆర్, తెలంగాణలో చట్టాన్ని ఉల్లంఘిస్తూ పేదల జీవితాలను ఆగం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పుడు రాష్ట్రంలో పేదల ఇళ్లను అదే విధంగా కూల్చేస్తూ ఆ కుటుంబాలను నిరాశ్రయులు చేస్తున్నారని ఆయన ఆక్షేపించారు.
వికలాంగులకు చెందినవే : దీనిపై మీ సమాధానం ఏమిటి? అంటూ మల్లిఖార్జున ఖర్గేను కేటీఆర్ సూటిగా ప్రశ్నించారు. మహబూబ్‌నగర్ పట్టణంలోని 75 మంది పేదల ఇళ్లను తెల్లవారుజామున 3 గంటలకు ఎలాంటి నోటీసులు లేకుండా కూల్చివేసిన సంఘటనను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. మీ ప్రభుత్వం కూల్చేసిన 75 కుటుంబాల ఇళ్లలో 25 కుటుంబాలు వికలాంగులకు చెందినవేనని ఖర్గేకు తెలిపారు.