KTR Press Meet About E Formula E Race Case :ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టినా న్యాయపరమైన పోరాటం చేస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. ఫార్ములా ఈ-కారు కేసులో సుప్రీంకోర్టులో తన పోరాటం కొనసాగుతుందని ప్రకటించారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని తనపై అక్రమ కేసులు పెట్టారని ఆయన మండిపడ్డారు. రాజకీయంగా కక్ష సాధింపు కేసు అని తెలిసినా కూడా ఏసీబీ విచారణకు హాజరయ్యానని, కానీ ప్రభుత్వం తన హక్కులకు భంగం కలిగేలా ప్రవర్తిస్తోందని ఆరోపించారు.
లాయర్లను ఎందుకు అనుమతించరు : విచారణకు లాయర్లతో రావద్దని ఎలా చెబుతారని కేటీఆర్ ప్రశ్నించారు. లాయర్ల సమక్షంలోనే విచారణ చేపట్టాలని, చట్టపరమైన రక్షణ కల్పించాలని హైకోర్టును ఆశ్రయిస్తానని ఆయన ప్రకటించారు. ఫార్ములా ఈ-కారు కేసులో ఏం జరగబోతుందో కొందరు మంత్రులు ముందే చెబుతున్నారని కేటీఆర్ అన్నారు. విచారణ సచివాలయంలో జరగదని, మంత్రుల పేషీలోనూ జరగదని, న్యాయస్థానాల్లోనే జరుగుతుందని తెలిపారు. గతంలో కాంగ్రెస్ నేతలకు కూడా ఇలాంటి అనుభవాలు ఎదురైతే కోర్టుకే వెళ్లారని కేటీఆర్ గుర్తు చేశారు.
"అణాపైసా అవినీతి జరగలేదని మరోసారి చెబుతున్నా. హైదరాబాద్‌ను ప్రపంచపటంలో నిలిపేందుకు తీసుకున్న నిర్ణయం. ఎలక్ట్రిక్ వాహనాలకు హైదరాబాద్‌ను కేంద్రంగా తీర్చిదిద్దాలనేది ఆలోచన. మీ మాదిరిగా దివాలాకోరు పనులు చేయాల్సిన అవసరం లేదు. ఎలాంటి విచారణకు రావాలని పిలిచినా నేను వస్తాను. ఎల్లుండి కూడా లాయర్లతో అనుమతిస్తే విచారణకు వెళ్తా. ఈనెల 16న ఈడీ విచారణకు కూడా హాజరవుతా. ఎలాంటి విచారణ ఎదుర్కోవడానికైనా నేను సిద్ధం. ఏదో జరిగిందని కొందరు శునకానందం పొందుతున్నారు. విచారణను కొనసాగించాలని చెప్పిందే తప్ప కోర్టు నాకు శిక్ష వేయలేదు" -కేటీఆర్, మాజీమంత్రి