ED Investigates KTR Formula E Race Case :ఏసీబీ లాగానే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా అడిగిన ప్రశ్నలనే మళ్లీ మళ్లీ అడిగిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. 7 గంటల పాటు కొనసాగిన ఈడీ విచారణ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. అడిగిన ప్రశ్నలనే తిప్పి తిప్పి అడిగారని, విచారణకు ఎన్నిసార్లు పిలిచినా వస్తానని ఈడీకి చెప్పినట్లు కేటీఆర్ తెలిపారు.
రేవంత్‌పై ఈడీ కేసు ఉందనే : తాను ఏ తప్పు చేయకున్నా చట్టాలను గౌరవించే పౌరుడిగా విచారణకు వచ్చానని, ఒక్క రూపాయి అవినీతి చేయలేదని స్పష్టం చేశారు. రేవంత్‌రెడ్డిపై ఈడీ కేసు ఉందని, అందుకే తనపై కూడా కేసు పెట్టించారని కేటీఆర్ ఆరోపించారు. జడ్జి ముందు ప్రత్యక్ష విచారణకు సిద్ధమని, దమ్ముంటే సీఎం రేవంత్‌రెడ్డి రావాలని సవాల్ విసిరారు.
నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధమే : తనపై పెట్టిన కేసుల్లో లై డిటెక్టర్ పరీక్షకు కూడా తాను సిద్ధమని కేటీఆర్ ప్రకటించారు. తనకు కోర్టులు, జడ్జిలపై నమ్మకం ఉందని, చివరకు న్యాయమే గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తాను తప్పు చేయలేదని, చేయబోనని, తప్పు చేశానని నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధమని ఈ సందర్భంగా తెలిపారు.