KTR Meeting with Minority Cell Morcha :కాంగ్రెస్ పార్టీరానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి లబ్ధి చేకూర్చేలా బలహీనమైన అభ్యర్థులను నిలబెట్టేందుకు ప్రయత్నిస్తోందని కేటీఆర్(KTR) ఆరోపించారు. గత పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఇదే తరహాలో బీజేపీకి కాంగ్రెస్ లబ్ధి చేకూర్చిందని పేర్కొన్నారు. బీజేపీ, కాంగ్రెస్ అనేక ఎన్నికల్లో కలిసి పనిచేశాయని, రానున్న ఎన్నికల కోసం ఇదే తీరుగా పనిచేసేందుకు సమాయత్తమవుతున్నాయని తెలిపారు. కాంగ్రెస్, బీజేపీ ఫెవికాల్ బంధాన్ని మైనార్టీ సోదరులు గుర్తించాలని కేటీఆర్ కోరారు.
ఎలక్షన్ కోడ్‌లోపు ఆరు గ్యారంటీలను అమలుచేయాలి : హరీశ్‌రావు
BRS Latest News : అర్‌ఎస్ఎస్ మూలాలున్న సీఎం రేవంత్ రెడ్డి మైనార్టీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారని బీఆర్ఎస్(BRS) కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ మైనార్టీ విభాగం సమావేశంలో శ్రేణులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలు బుల్డోజర్ పాలసీతో మైనార్టీ ఆస్తులను, హక్కులను హరిస్తుంటే రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో అదే బుల్డోజర్ పద్ధతిలో మైనార్టీలపై ప్రతీకారం తీర్చుకుంటున్నారని అన్నారు.
మైనార్టీలకు మంత్రి పదవి ఇచ్చిన తర్వాత కూడా శాసనసభ్యునిగా ఎమ్మెల్సీ పదవి ఇవ్వవచ్చన్న విషయం కాంగ్రెస్(Congress Party) కావాలనే మరిచిపోయిందని కేటీఆర్ ఆరోపించారు. కేవలం ఎన్నికల్లో ఓటర్లుగా మాత్రమే మైనార్టీలను కాంగ్రెస్ పార్టీ చూస్తుందని విషయం మైనార్టీ సోదరులు అర్థం చేసుకోవాలని కోరారు. మైనార్టీలకు రాజకీయ ప్రాతినిథ్యం కల్పించకుండా అడ్డుకునే విషయంలో కాంగ్రెస్ పార్టీ బీజేపీతో పోటీ పడుతుందని దుయ్యబట్టారు.
ఎవరితో సంబంధం లేకుండా గట్టిగా పోరాడదాం - త్వరలోనే ప్రజల్లోకి వస్తాను : కేసీఆర్
ఎన్నికల ముందు మైనార్టీ సెంటిమెంట్‌ను రెచ్చగొట్టేందుకు కాంగ్రెస్ పార్టీ షబ్బీర్ అలీ పేరు వాడుకొందని, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనకు కేవలం సలహాదారు పదవి ఇచ్చి చేతులు దులిపేసుకొన్నారని కేటీఆర్ మండిపడ్డారు. మైనార్టీలకు మంత్రి పదవి కాకుండా సలహాదారు పదవి మాత్రమే ఇవ్వడం అంటే వారి ఆత్మ గౌరవాన్ని దెబ్బతీయటమేనని అన్నారు. 50 రోజుల కాంగ్రెస్ పాలనలో ఒక్కరోజు కూడా మైనార్టీ సంక్షేమంపై సమీక్ష నిర్వహించలేదని కేటీఆర్ అన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన 12 ప్రధానమైన హామీలను వెంటనే అమలు చేయాలని, ముస్లిం రిజర్వేషన్ కోటా పెంపు, 4000 కోట్ల రూపాయల బడ్జెట్ మైనార్టీలకు కేటాయించడం వంటి అంశాలపై తక్షణమే చర్యలు ప్రారంభించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మతకల్లోలాలు చెలరేగుతాయని తాము హెచ్చరించామన్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హయాంలో సంగారెడ్డి, నల్గొండ, అనేక ఇతర ప్రాంతాల్లో జనవరి 22వ తేదీన మత ఘర్షణలు చోటు చేసుకున్న విషయాన్ని కేటీఆర్ ప్రస్తావించారు.
"రాష్ట్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీకి సహకరించిది. కాంగ్రెస్ పార్టీరానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి లబ్ధి చేకూర్చేలా బలహీనమైన అభ్యర్థులను నిలబెట్టేందుకు ప్రయత్నిస్తోంది. బీజేపీ, కాంగ్రెస్ అనేక ఎన్నికల్లో కలిసి పనిచేశాయి. కాంగ్రెస్, బీజేపీ ఫెవికాల్ బంధాన్ని మైనార్టీ సోదరులు గుర్తించాలి". - కేటీఆర్, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్
కాంగ్రెస్, బీజేపీ ఫెవికాల్ బంధాన్ని మైనార్టీ సోదరులు గుర్తించాలే కేటీఆర్ 'కేసీఆర్‌ను వదిలి వెళ్లే ప్రసక్తే లేదు - మా ప్రతిష్ఠకు భంగం కలిగిస్తే దావా వేస్తాం'