KTR Criticized The Mortgaging Government Lands Idea: రాష్ట్ర ప్రభుత్వం భూములు తనఖా పెడుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ఈ మేరకు ఎక్స్ ద్వారా స్పందించిన ఆయన కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాలను తప్పుబట్టారు. భూములను తాకట్టు పెట్టడాని బీఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు పేర్కొన్నారు. 400 ఎకరాల భూమిని తనఖా పెట్టాలనుకోవడం అనాలోచిత చర్యగా కేటీఆర్ అభివర్ణించారు.
రాష్ట్ర ఆర్థిక రంగాన్ని సరిగ్గా నడపడం చేతకాని రేవంత్ సర్కార్ ఇప్పుడు నిధుల సమీకరణకు ఒక ప్రమాదకరమైన మార్గం ఎంచుకుందని కేటీఆర్ విమర్శించారు. తెలంగాణ పరిశ్రమల శాఖకు చెందిన 20 వేల కోట్ల విలువైన 400 ఎకరాల ప్రభుత్వ భూములను ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలకు తనఖాపెట్టి 10 వేల కోట్లు సమీకరించాలని భావిస్తున్నట్టు సమాచారం ఉందని ఎక్స్ వేదికగా తెలిపారు.
భూములను ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలకు తనఖా పెట్టేందుకు మధ్యవర్తిగా ఒక మర్చంట్ బ్యాంకర్‌ను పెట్టి వారికి 100 కోట్ల కమీషన్ ఇచ్చేందుకు సిద్ధమైందని మీడియాలో కథనాలు వస్తున్నాయన్నారు. ఈ మతిలేని చర్య వల్ల తెలంగాణ ప్రగతి శాశ్వతంగా కుంటుపడుతుందని పేర్కొన్నారు. కొత్తగా పెట్టుబడులు, పరిశ్రమలు రాక, ఉద్యోగాలు రాక, మన బిడ్డలకు కొలువులు రాకుండా పోయే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.