Kishan Reddy and Bandi Sanjay Took Charge in Delhi : కేంద్ర మంత్రులుగా దిల్లీలో కిషన్‌రెడ్డి, బండి సంజయ్ బాధ్యతలు చేపట్టారు. ప్రత్యేక పూజల మధ్య వారు బాధ్యతలు స్వీకరించారు. గతంలో కేంద్రంలో హోంశాఖ సహాయ మంత్రి, అనంతరం, పర్యాటకశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన కిషన్‌రెడ్డి, ఇటీవల సార్వత్రిక ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి రెండో సారి ఎంపీగా గెలుపొందారు.
మోదీ కేబినెట్‌లో మరోసారి కిషన్‌రెడ్డి అవకాశం దక్కించుకున్నారు. ఆయనకు బొగ్గు, గనులశాఖ బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు తన ఛాంబర్‌లో ప్రత్యేక పూజలు నిర్వహించి, బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ దేశంలో విద్యుత్ లేకుండా ఏ పనీ కాదని కిషన్‌రెడ్డి అన్నారు. వ్యవసాయం నుంచి ఐటీ పరిశ్రమ వరకు ప్రజల జీవితాలు కరెంట్‌తో పెనవేసుకుని ఉన్నాయని ఆయన చెప్పారు.
గతంలో విద్యుత్ సమస్యలు అనేకం : గతంలో విద్యుత్ సమస్యలు అనేకమని కిషన్‌రెడ్డి తెలిపారు. పంటలు ఎండిపోవడం, పరిశ్రమలు ఉత్పత్తి నిలిచిపోవడం వంటి అనేక సమస్యలు ఉండేవని గుర్తుచేశారు. మోదీ హయాంలో కోతలు లేకుండా కరెంట్ అందిస్తున్నామని చెప్పారు. అధికంగా బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి జరుగుతోందని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. కరెంట్ కోతలు లేకుండా ఉండాలంటే బొగ్గు ఉత్పత్తి పెంచాలని అన్నారు. మనం ఇతర దేశాల నుంచి బొగ్గు దిగుమతి చేసుకుంటున్నామని, రానున్న రోజుల్లో దిగుమతి తగ్గించి దేశీయంగా ఉత్పత్తి పెంచనున్నట్లు చెప్పారు. ఖనిజాల అన్వేషణ, తవ్వకాల ద్వారా ఉపాధి కల్పనకు కృషి చేస్తానని కిషన్‌రెడ్డి వెల్లడించారు.