తెలంగాణ

telangana

ETV Bharat / state

చవకమ్మా చవకా - అక్కడ కిలో ఉల్లిగడ్డ రూ.15 మాత్రమే! - ONION PRICES IN AP

ఏపీలోని కర్నూలు జిల్లాలో ఉల్లిగడ్డ కిలో రూ.15లు - కర్నూలు జిల్లా ఉల్లి రైతులకు ఉల్లి కష్టాలు - కనీసం పండించిన పంటకు మద్దతు ధర రావడం లేదని రైతులు ఆవేదన

Onion Prices in AP
Onion Prices in AP (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Oct 30, 2024, 8:41 PM IST

Onion Prices in AP :అక్కడ కిలో ఉల్లిగడ్డలు కేవలం రూ.15లు మాత్రమే. ఇదేంటి బయట చూస్తే ఉల్లి కిలో రూ.60 గా ఉంది కదా. మరి రూ.15కే ఎక్కడ ఇస్తున్నారని ఆశ్చర్యంగా చూస్తున్నారు కదా. అది పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్​లోని కర్నూలు జిల్లాలో ఈ రేటు ఉంది. ఇది ఎలా అంటారా? కర్నూలు వ్యవసాయ మార్కెట్​లో క్వింటాల్​ ఉల్లి గడ్డ రూ.1000 నుంచి రూ.1500 పలుకుతుంది. అంటే కిలో రూ.15 లెక్కనే కదా. ఇప్పుడు ఇదే అక్కడ పెద్ద సమస్యగా మారింది. కర్నూలు జిల్లా ఉల్లి రైతులు ఆందోళన చెందుతున్నారు. కనీసం పండించిన పంటకు మద్దతు ధర కూడా కరవైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఉల్లికి కుళ్లిపోయే గుణం ఎక్కువ :సాధారణంగా ఉల్లికి కుళ్లిపోయే గుణం ఎక్కువ. అందుకే ఎప్పటికప్పుడు గ్రేడింగ్​ చేయాలి. అలా చేస్తేనే వ్యాపారులు కొనుగోలు చేయడానికి ముందుకు వస్తారు. ఇలా గ్రేడింగ్​ చేయాలంటే అదనంగా ఖర్చు చేయాలి. ఇప్పుడు ఉల్లి రోజువారీ వ్యాపారం జరగకపోవడంతో తరుగు పేరుతో 5 నుంచి 10 క్వింటాళ్ల సరకును పారబోయాల్సి వస్తోందని ఉల్లి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

గుట్టలుగా నిల్వ ఉన్న ఉల్లిగడ్డలు : కర్నూలు వ్యవసాయ విపణిలో కొనుగోళ్లు సక్రమంగా లేకపోవడంతో ఉల్లిగడ్డలు గుట్టలుగా పేరుకుపోయాయి. ఈ కర్నూలు నుంచే కోల్​కతా, కేరళ, కటక్, తమిళనాడు, గుజరాత్ తదితర ప్రాంతాలకు ఉల్లి ఎగుమతి అవుతుంది. అయితే వ్యాపారులు కొనుగోలు చేసిన సరకు మార్కెట్ నుంచి బయటకు తరలించడంలో జాప్యం జరుగుతోంది. లారీ దొరక్కపోవడంతో లోడింగ్​ కూడా సమస్య అవుతుంది. సుమారు ఆరు వేల టన్నుల సరకు పేరుకుపోయింది.

దళారుల వేధింపులు :కర్నూలు ఉల్లి మార్కెట్​లో కొనుగోళ్ల సమస్య ఓవైపు వేధిస్తుంటే మరోవైపు దళారుల సమస్య అధికం అవుతుంది. దళారులు రైతుల నుంచే ఉల్లిని తక్కువ ధరకు కొనుగోలు చేసి మార్కెట్​లోనే ట్రేడింగ్​ చేసి అధిక ధరకు అమ్ముకుంటున్నారు. దళారులను మార్కెట్​లోకి రానీయకుండా అడ్డుకోవాల్సిన అధికారులు పట్టించుకోవడం లేదు.

కిలో ఉల్లి ధర రూ.15 : కర్నూలు వ్యవసాయ మార్కెట్​లో అనధికారిక వ్యాపారాలు చేయకుండా పంటను ఈనామ్ విధానంలో కొనుగోలు చేయాలి. సర్వర్ పనిచేయకపోవడంతో రెండు రోజులుగా టెండర్​ విధానంలో కొనుగోలు చేస్తున్నారు. కానీ కొందరు వ్యాపారులు, దళారులు కుమ్మక్కై రైతుల నుంచి కొందరు అనధికార విక్రయాలు చేస్తున్నారు. బహిరంగ మార్కెట్​లో సరాసరి ఉల్లి కిలో ధర రూ.60 వరకు ఉండగా రైతుల నుంచి క్వింటా రూ.1000 నుంచి రూ.1500లకు కొనుగోలు చేస్తున్నారు. అంటే కిలో ఉల్లికి అత్యధికంగా రూ.15 అన్నమాట.

ఉమ్మడి కర్నూలు జిల్లాలోనే ఉల్లి సాగు అత్యధికం :తెలుగు రాష్ట్రాల్లో ఉమ్మడి కర్నూలు జిల్లాలోనే అత్యధికంగా ఉల్లిని సాగు చేస్తారు. ఖరీప్​, రబీ సీజన్లలో ఉల్లి సాగు 87500 ఎకరాల్లో వేస్తారు. ఇలా ఏటా సరాసరి 5.25 లక్షల టన్నుల ఉల్లి దిగుబడి వస్తుంది. ఈ ఏడాది ఉల్లిసాగు తగ్గినా కాల్వలు, బోర్లు, బావుల నీటి వల్ల ఉల్లిసాగు గణనీయంగా పెరిగింది. ఈ ఖరీప్​ సీజన్​లో ఉల్లిసాగు 45 వేల ఎకరాల్లో సాగిందని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి.

మహారాష్ట్రలో తగ్గిన దిగుమతి : మహారాష్ట్రలో జూలై చివర్లో భారీ వర్షాలు కురవడంతో అక్కడ ఉల్లి దిగుబడులు బాగా తగ్గిపోయాయి. కర్నూలు జిల్లాలో ఉల్లి ధరకు రెక్కలు వచ్చాయి. రైతు బజార్లలో కిలో ఉల్లి రూ.40 నుంచి రూ.60 వరకు పలుకుతుండగా బహిరంగ మార్కెట్​లో రూ.80 వరకు పలుకుతోంది. కర్నూలు మార్కెట్​లో మాత్రం క్వింటా ఉల్లి ధర గరిష్ఠంగా రూ.4,600 - కనిష్ఠం రూ.4000గా ఉంది. సరాసరి ఇది రూ.1000 నుంచి రూ.1500 పలుకుతోంది.

Onion Price Hike : ఉల్లి ధరకు రెక్కలు.. తక్కువ రేటుకు ఎక్కడ దొరుకుతుందంటే?

ఉల్లి ధర అప్పటికల్లా తగ్గుతుంది! : కేంద్రం

ABOUT THE AUTHOR

...view details