ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పేదింటి బిడ్డల పెద్ద మనస్సు- ఆపత్కాలంలో అందరికీ ఆత్మీయులు - కిద్మతే కల్క్ చారిటబుల్ ట్రస్టు

Khidmate Khalq Charitable Trust: ఎవరైనా ఆపదలో ఉన్నారంటే చాలు క్షణాల్లో వాలిపోతారు. ఎలాంటి సాయం చేయడానికైనా మేం సిద్ధం అంటారు. వారంతా పేదలే కానీ తమకంటే పేదలకు ఏదో ఒకటి చేస్తూ ఆదుకోవాలనే సేవాభావాన్ని మదినిండా నింపుకొన్నారు.

Khidmate_Khalq_Charitable_Trust
Khidmate_Khalq_Charitable_Trust

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 11, 2024, 1:14 PM IST

Updated : Feb 11, 2024, 1:52 PM IST

పేదింటి బిడ్డల పెద్ద మనస్సు- ఆపత్కాలంలో అందరికీ ఆత్మీయులు

Khidmate Khalq Charitable Trust: శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి పేరు వినగానే సేవకు మారుపేరుగా నిలిచిన శ్రీ సత్య సాయిబాబా వెంటనే గుర్తొస్తారు. సత్యసాయి సేవాభావాన్ని పుణికిపుచ్చుకున్న అక్కడి యువకులు సాయి మార్గాన్ని ఎంచుకున్నారు. పేదకుటుంబాలకు చెందిన వారైనప్పటికీ శక్తికి మించి తమకంటే నిరుపేదలైన వారికి సేవలందిస్తున్న వైనం అందరి ప్రశంసల జల్లు కురిపిస్తోంది.

వారందరూ రెక్కాడితే కాని డొక్క నిండని పేద కుటుంబాలకు చెందిన యువత. పుట్టపర్తి పట్టణంలో కొందరు ఆటో డ్రైవర్లు, మరొకరు కళ్లద్దాల దుకాణంలో పనిచేసే యువకుడు, ఇంకొకరు పారిశుద్ధ్య కార్మికుడు ఇలా ఒక్కొక్కరు ఒక్కో వృత్తిలో అరకొర ఆదాయంతో జీవనం చేస్తున్నవారే. వారికి ఆదాయం తక్కువే కాని బుద్ధి, మనసు మాత్రం చాలా పెద్దదనే చెప్పాలి.

తమ సంపాదనలో కొంత మొత్తాన్ని తమకంటే నిరుపేదలు, మూగజీవుల కోసం వ్యయంచేస్తున్నారు. పుట్టపర్తిలో నిరంతరం సేవా మార్గంలో ప్రయాణిస్తున్న షామీర్ మిత్ర బృందం గురించి తెలియని వారుండరు. ఈ సేవా బృందం స్థాపకుడు షామీర్. పుట్టపర్తి పట్టణంలో దశాబ్ద కాలంగా షామీర్, మిగిలిన యువకులంతా వేర్వేరుగా తమకు తోచిన విధంగా సేవలు అందించేవారు.

ఎన్నో ఆర్థిక సమస్యలు అధిగమించి పీహెచ్​డీ - కర్ణాటక గవర్నర్​ నుంచి పట్టా అందుకున్న యువకుడు

ఈ క్రమంలోనే ప్రపంచ ప్రజలను వణికించిన కరోనా మహమ్మరి, లాక్​డౌన్​ పరిస్థితులు షామీర్​ను, పుట్టపుర్తిలోని యువకులను ఒక్కచోటికి చేర్చాయి. కూలీకి వెళ్లలేక రోజువారీ ఆర్థిక అవసరాలు తీర్చుకోలేని నిరుపేదల ఆకలి తీర్చే క్రమంలో యువకులకు షామీర్​తో పరిచయం ఏర్పడింది.

తొలి లాక్​డౌన్​లో అందరూ కలిసి పేదలకు నిత్యావసరాలు, మూగజీవుల ఆకలి తీర్చే సేవా కార్యక్రమాలు నిర్వహించారు. అప్పట్లోనే షామీర్ సలహా మేరకు ఒక సేవాసంస్థను ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించారు. అనుకున్నదే ఆలస్యం అన్నట్లు 'కిద్మతే కల్క్ చారిటబుల్ ట్రస్టు'ను ఏర్పాటు చేశారు. అప్పటికే అందరూ యువకులు ఎవరికివారు సేవా కార్యక్రమాలు, అత్యవసర పరిస్థితిలో రక్తదాన సేవలు అందించేవారు.

సేవా సంస్థను ఏర్పాటు చేసిన తరువాత అందరూ ఈ ట్రస్టు ద్వారా రక్తదానం, మూగజీవాల ఆకలితీర్చే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రెండో విడత కరోనా విజృంభించటంతో అనేక మంది వైరస్​తో మృత్యువాత పడ్డారు. చాలా కుటుంబాల్లో ఇంట్లో ఉండేవారంతా వైరస్​కు గురై ఆసుపత్రిపాలయ్యారు. ఈ క్రమంలోనే వైరస్​తో మృతిచెందిన కుటుంబ సభ్యులకు అంత్యక్రియలు కూడా నిర్వహించలేని పరిస్థితి ప్రపంచ వ్యాప్తంగా ఎదురైంది.

జీఎంఆర్‌ ఐటీ వేదికగా స్మార్ట్‌ ఇండియా హ్యాకథాన్‌ పోటీలు - ఆధునిక సాంకేతికతను రూపొందించిన విద్యార్థులు

కరోనా మృతులను చూడటానికి కూడా భయపడిన పరిస్థితుల్లో 'కిద్మతే కల్క్ ట్రస్టు' సభ్యులు మృతులకు అంత్యక్రియలు నిర్వహించారు. మృతి చెందినవారు ఏ మతానికి చెందినవారైతే వారి సంప్రదాయం ప్రకారం ఆత్మీయులుగా మారి అంత్యక్రియలు నిర్వహించారు. పుట్టపర్తిలో అధికారులు, ప్రజాప్రతినిధులు సైతం అప్పట్లో మృతదేహాలను షామీర్ బృందం ద్వారా అంత్యక్రియలు జరిపించటంతో అందరికీ వారి సేవా కార్యక్రమాల గురించి బాగా తెలిసింది.

రక్తదానం చేస్తున్న షామీర్ మిత్ర బృందానికి మరో ప్రత్యేకత ఉంది. ఈ ట్రస్టులో ఉన్న సభ్యులంతా నెగిటివ్ గ్రూపు రక్తదాతలే. మరో ఇద్దరు సభ్యులు అరుదైన బొంబాయి గ్రూపు రక్త దాతలు కావటం విశేషం. ఈ గ్రూపు రక్తం అవసరమైన వారికి హైదరాబాద్, బెంగుళూరుకు వెళ్లి ఇచ్చి వస్తున్నారు. తామంతా తమకు వచ్చే ఆదాయంలో ఎంతో కొంత పేదలకోసం, మూగజీవుల కోసం వెచ్చిస్తున్నట్లు యువకులు చెబుతున్నారు. ఎవరి వద్ద చిల్లిగవ్వ ఆర్థిక సహాయం తీసుకోకుండా, తమ రోజువారీ సంపాదనతోనే సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న పుట్టపర్తి యువకులు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.

"కరోనా తొలి లాక్​డౌన్​ సమయంలో మృతి చెందినవారి పరిస్థితిని చూసి చలించిపోయి అంత్యక్రియలు నిర్వహించాం. ఈ నేపథ్యంలో పదిమంది వరకు ఒక బృందంగా ఏర్పడి 'కిద్మతే కల్క్ చారిటబుల్ ట్రస్టు'ను ఏర్పాటు చేశాం. సేవా సంస్థను ఏర్పాటు చేసిన తరువాత మేమంతా ఈ ట్రస్టు ద్వారా రక్తదానం, మూగజీవాల ఆకలితీర్చే కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం." - కిద్మతే కల్క్​ చారిటబుల్ ట్రస్టు సభ్యులు

Last Updated : Feb 11, 2024, 1:52 PM IST

ABOUT THE AUTHOR

...view details