Sankranti Festival Strange Tradition: సాధారణంగా పండుగలంటే ఎవరికైనా గుర్తొచ్చేది సంప్రదాయ వస్త్రధారణలో మెరిసే మహిళలు, వాళ్లు చేసే పిండి వంటలు. కానీ ఆ ఊరిలో సంక్రాంతికి ముందు వచ్చే పండుగ కేవలం మగవాళ్లకి మాత్రమే. ఇదెక్కడి వింత ఆచారం అనుకుంటున్నారా? అదేంటో తెలుసుకోవాలంటే మనం అన్నమయ్య జిల్లా పుల్లంపేట మండలం తిప్పాయపల్లెకు వెళ్లాల్సిందే.
చిన్నా, పెద్ద, ముసలి వాళ్లన్న తేడాలేకుండా చేతిలో పాత్రలతో కొందరు, బెల్లం గంపలతో వెళ్తూ పొయ్యి మీద పొంగలి తయారు చేస్తూ ఆడవాళ్ల సాయం లేకుండా తీవ్రంగా పురుషులు ఎందుకు శ్రమిస్తున్నారో అనుకుంటున్నారా? ఏటా సంక్రాంతికి ముందు వచ్చే ఆదివారం రోజు పంచెకట్టులో, కట్టెలు చేతబట్టి పొయ్యిమీద పొంగలి సిద్ధం చేసి స్వామివారికి నైవేద్యం సమర్పించటం ఆనవాయితీ. తిప్పాయిపల్లెలోని శ్రీ సంజీవరాయ స్వామి పొంగళ్ల పండుగను దశాబ్దాల నుంచి ప్రజలు అత్యంత భక్తి, శ్రద్ధలతో నిర్వహించుకుంటున్నారు. అది మగవాళ్ల పండుగ, పూజల నుంచి పొంగళ్ల వరకు అంతా మగవారే చేయాలి.
ప్రసాదాలను ఆడవాళ్లు తినకూడదు: ఇతర ప్రాంతాల్లో స్థిరపడిన గ్రామవాసులు పొంగళ్ల పండుగకు కచ్చితంగా వచ్చి ఆచారాన్ని పాటిస్తారు. అయితే స్వామి వారికి చేసే ప్రసాదాల్లో ఆడవాళ్ల ప్రమేయం ఉండదు. కట్టెపుల్లలు కూడా అందించకూడదు. ప్రసాదం కూడా స్వీకరించరు. ఆచారం ప్రకారం గ్రామంలోని మగవాళ్లు తెల్లవారుజామునే లేచి నిష్టతో స్నానాలు ఆచరించి, పట్టు వస్త్రాలు ధరించి కట్టెపుల్లల దగ్గర నుంచి పొంగళ్లకు కావాల్సిన సామగ్రి మొత్తాన్ని ఆలయంలోకి తీసుకెళ్లి స్వయంగా పొంగళ్లు తయారుచేస్తారు. అనంతరం స్వామివారికి ఈ పొంగళ్లను నైవేద్యంగా పెడతారు. ఈ వింత ఆచారాన్ని చూసేందుకు చుట్టుపక్కల గ్రామాలు, జిల్లాల నుంచి ప్రజలు వస్తారు. ఈ ప్రసాదాలను ఆడవాళ్లు తినకూడదని స్థానికులు చెబుతున్నారు.
గ్రామంలోని ఆలయ విశిష్టత: పూర్వం తిప్పాయిపల్లె గ్రామ ప్రజలు రోగాల బారినపడి, మృతి చెందారు. ఆ సమయంలో ఒక సాధువు ఆ గ్రామంలోకి వచ్చి గ్రామ ప్రజలకు తాను ఒక విగ్రహం తయారు చేసి ఇస్తానని, దానికి ఎలా పూజలు చేయాలో ఆ గ్రామ ప్రజలకు నియమ నిబంధనలు తెలియజేశాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆలయంలో విగ్రహం ప్రతిష్ఠించిన తర్వాత, మహిళలు అడుగు పెట్టకూడదని, మగవారే స్వామికి ప్రసాదం చేసి సమర్పించి, పూజలు నిర్వహించాలని తెలిపాడు. ఈ పూజలు ప్రతి సంవత్సరం సంక్రాంతికి ముందు వచ్చే ఆదివారం రోజున ప్రతి ఒక్క గ్రామస్థుడు తప్పకుండా పాటించాలని తెలిపాడు.
ఆయన కేవలం ఒక్క రాత్రిలోనే రాతిపై బీజాక్షరాలు చెక్కి గ్రామ ప్రజలకు అప్పగించి మాయమైపోయాడని, అప్పటినుంచి ఆ విగ్రహం ఊరి పొలిమేరలో ప్రతిష్ఠించారు. దానికి ఆలయం నిర్మించారు. సాధువు రూపంలో ఆంజనేయ స్వామే వచ్చి ఆ విగ్రహంపై బీజాక్షరాలు లిఖించాడని, వారి రోగాలను తొలగించి, మృత్యువు నుంచి తప్పించారని నమ్ముతున్నారు. ఆంజనేయస్వామి సంజీవరాయునిగా ఆలయంలో భక్తులతో పూజలు అందుకుంటున్నాడు.
భోగిపళ్లుగా మారే రేగిపళ్లు- ఆ రోజే పిల్లల తలపై ఎందుకు పోస్తారో తెలుసా?
భోగభాగ్యాల భోగి పండుగ- ఆ పేరెలా వచ్చింది? భోగి మంటలతో కలిగే ప్రయోజనాలెన్నో!