Bhogi Festival 2025: సంక్రాంతి పండుగ ప్రారంభమయ్యేదే భోగి మంటలతో. పది రోజుల ముందు నుంచే చిన్నా, పెద్దా అంతా కలసి ఆవుపేడతో పిడకల తయారీలో నిమగ్నమవుతారు. భోగి పండుగ రోజు ఊరంతా ఒక్కచోట చేరి తెల్లవారుజామున భారీ ఎత్తున మంటలు వేసి సందడి చేస్తారు. అయితే ఏపీలోని పలు గ్రామాల్లో భోగి, సంక్రాంతిని ప్రత్యేకంగా జరుపుకుంటారు. ఆ విశేషాలను ఇప్పుడు చూద్దాం.
బోనాలతో సంక్రాంతి: పార్వతీపురం మన్యం జిల్లా బలిజిపేట మండలం మిర్తివలసలో సంక్రాంతిని తెలంగాణ పద్ధతిలో బోనాలతో జరుపుకుంటారు. పసుపు, కుంకుమలతో బోనాలను అలంకరించి, పూజలు చేసి ప్రసాదాలను వాటిల్లో ఉంచుతారు. తర్వాత తలపై పెట్టుకొని గ్రామ శివారులోని వెంకమ్మ పేరంటాల గుడిలో బోనాలను సమర్పిస్తారు. పురుషులు చేతిలో కత్తులు పట్టుకుని, పంచె కట్టుతో ముందు నడుస్తూ వెళ్తుంటారు. దీనిని చూసేందుకు పరిసర గ్రామాల ప్రజలు తరలివస్తారు.
పిల్లి పండుగ ప్రత్యేకం: పార్వతీపురం మండలంలోని నర్సిపురంలో కనుమను శివాలయం వద్ద ఉన్న ఓ గ్రౌండ్లో నిర్వహిస్తారు. తాళ్లబురిడిలో వింజమ్మ కొండపైకి ప్రజలు చేరుకొని అమ్మవారిని దర్శించుకుంటారు. రావికోన పంచాయతీ అడ్డూరివలసలో పిల్లి పండుగ పేరుతో నిర్వహిస్తారు. దీనిని పాండవుల పండుగ అని కూడా పిలుస్తారు. ఓ తట్టలో పిల్లాడిని పెట్టి చుట్టూ ఆకులు చుట్టి గ్రామంలో ఊరేగిస్తారు. ఆ పిల్లడు ఎటుదిగితే అటుగా అటవీ ఉత్పత్తుల సేకరణ, జంతు వేటను ప్రారంభిస్తారు.
ఇటకర్లపల్లిలో 9 రోజుల పండుగ: సాధారణంగా సంక్రాంతి పండుగ అంటే మూడు రోజులు అని మాత్రమే చెప్తారు. కానీ విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం ఇటకర్లపల్లి గ్రామస్థులు మాత్రం 9 రోజుల పాటు జరుపుకుంటారు. నేటి తరం యువత సైతం తమ పెద్దలు పాటించిన సంప్రదాయాలను పాటిస్తున్నారు. గ్రామానికి ఎవరైనా కొత్తవారు వస్తే వారిని తమ ఇళ్లకు ఆహ్వానించి సందడి చేస్తారు. అన్ని వర్గాల వారూ కలిపి 9 రోజుల పాటు సంక్రాంతి ఉత్సవాలు నిర్వహిస్తారు.
భోగ భాగ్యాల పండుగ: విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం కృష్ణాపురంలో ఆవుపేడతో తయారు చేసిన పిడకలతో భారీ దండను తయారు చేశారు. భోగి మంటల్లో కర్రలు, టైర్లు వేయడం వల్ల పొగ వెలువడి కాలుష్యానికి కారణం అవుతోందని భావించి, దాన్ని నివారించడానికి పిడకలు తయారు చేశామని చెప్పారు.
భోగభాగ్యాల భోగి పండుగ- ఆ పేరెలా వచ్చింది? భోగి మంటలతో కలిగే ప్రయోజనాలెన్నో!