Sankranti Cockfighting Arenas: సంక్రాంతి రానే వచ్చింది. పల్లెల్లో సందడి నెలకొంది. మూడ్రోజుల వేడుకలో ప్రత్యేకంగా నిలిచే కోడి పందేల నిర్వహణకు గ్రామాల్లో భారీ ఏర్పాట్లు చేశారు. మినీ స్టేడియాలను తలపించేలా బరులను సిద్ధం చేశారు. సై అంటున్న పందెం కోళ్లను రాత్రి, పగలు తేడా లేకుండా బరిలో నిలబెట్టేందుకు భారీ తెరలు, ఎల్‌ఈడీ దీపాలు పెట్టారు. అదే సమయంలో పందేలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవంటూ పోలీసులు హెచ్చరిస్తున్నారు.
కోటికి పైగా వ్యయంతో: సంక్రాంతి వేళ మూడ్రోజుల పాటు జోరుగా కోడిపందేలు, జూదాలు నిర్వహించేందుకు నిర్వాహకులు ఏరాట్లు చేసుకున్నారు. సంప్రదాయ కోడి పందేల బరులకు భిన్నంగా తొలిసారిగా రాష్ట్ర స్థాయిలో మినీ స్టేడియాన్ని తలపించేలా ఏలూరు జిల్లాలో తయారైన ఓ బరి ప్రస్తుతం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. సుమారు కోటికి పైగా వ్యయంతో పదుల సంఖ్యలో కార్మికులు, నెల రోజులకు పైబడి దీన్ని తయారు చేశారు. చిన్నపిల్లలు, మహిళలకు ప్రత్యేక గ్యాలరీలు, వీఐపీలకు రెస్ట్‌రూమ్‌లు సిద్ధం చేశారు. పందేలను చూసేందుకు వచ్చే వారి కోసం బరుల వద్ద పెద్దఎత్తున కుర్చీలు వేశారు.
25 ఎకరాల సువిశాల ప్రాంగణంలో: పశ్చిమ గోదావరి జిల్లా పెద్దఅమిరంలో 25 ఎకరాల సువిశాల ప్రాంగణంలో కోడి పందేల బరి సిద్ధమైంది. సినిమా సెట్టింగులను తలపించేలా భారీ బరి దారి పొడవునా ఫ్లెక్సీలు, వేలాది మంది కూర్చునేలా కుర్చీలు, ప్రముఖుల కోసం సోఫా సెట్లు, భారీ తెరలు, ఎల్ఈడీ దీపాలతో జబర్దస్‌గా ఏర్పాట్లు చేశారు. సెట్టింగ్‌లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
20 ఎకరాల విస్తీర్ణంలో బరులు సిద్ధం: బాపట్ల జిల్లా తీరప్రాంతంలో కోడి పందేల బరులు సిద్ధమయ్యాయి. చెరుకుపల్లి మండలం తూర్పుపాలెం, పిట్టలవానిపాలెం మండలం మంతెనవారి పాలెం , కొల్లూరు మండలం అనంతవరంలో ప్రధాన రహదారుల పక్కనే బరులు ఏర్పాట్లు చేశారు. ఫ్లడ్ లైట్లు కూడా పెట్టారు. జూదం ఆడేందుకు ప్రత్యేక గుడారాలు ఏర్పాటు చేశారు. సుమారు 20 ఎకరాల విస్తీర్ణంలో బరులు సిద్ధం చేశారు.
ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం గండేపల్లి సమీపంలో కోడి పందేలకు బరులు ఏర్పాటు చేశారు. కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గంలోని గ్రామాల్లో భారీగా కోడిపందేల బరులు సిద్ధమయ్యాయి. పందేలు జరిగే ప్రాంతంలో కుర్చీలు, టెంట్లు, ఎయిర్ కూలర్లు పెట్టారు. పామర్రు, కూచిపూడి, కోసూరు, పమిడిముక్కల, గడ్డిపాడు, గరికపర్రు, తోట్లవల్లూరు, కొమ్ముమూరు, పెదపారుపూడి, యలమర్రులో భారీ ఎత్తున పందేలకు ఏర్పాట్లు చేశారు.
విజయవాడ పటమట స్టేషన్ పరిధిలో కోడిపందేల బరులను పోలీసులు ధ్వంసం చేశారు. రామలింగేశ్వరనగర్, రామవరప్పాడు, ఎనికేపాడు గ్రామాల్లో ఏర్పాటు చేసిన బరులను ధ్వంసం చేశారు. టెంట్లు తొలిగించి, బరులను ట్రాక్టర్‌తో దున్నించారు. పండుగ వేళ జూద క్రీడలకు దూరంగా ఉండాలని హెచ్చరించారు. బాపట్ల జిల్లా జంపనిలో కోడి పందాలు బరిని ట్రాక్టర్లతో ధ్వంసం చేశారు. జెండాలు, టెంట్లు తొలగించారు.
ఎన్టీఆర్ జిల్లాలో కోడి పందేల బరులపై డ్రోన్లతో ప్రత్యేక నిఘా పెట్టిన పోలీసులు అనేక చోట్ల బరులు ధ్వంసం చేశారు. కోడి పందేలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని విజయవాడ సీపీ రాజశేఖర్ బాబు హెచ్చరించారు. కడప జిల్లా పులివెందులలో కోడిపందాలు, జూదం ఆడితే కేసులు నమోదు చేస్తామని డీఎస్పీ మురళి నాయక్ హెచ్చరించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా కోడి పందాలకు ఎలాంటి అనుమతులు ఇవ్వలేదన్నారు. ఎక్కడ పందేలు జరిగినా పోలీసులకు సమాచారాన్ని ఇవ్వాలని కోరారు.