How to Make Pakundalu Recipe : సంక్రాంతి అనగానే నోరూరించే పిండి వంటలు, కోళ్ల పందాలు, అద్దిరిపోయే నాటుకోడి పులుసు గుర్తుకొస్తుంటాయి. ముఖ్యంగా గోదావరి జిల్లాలు కోళ్ల పందాలు, రకరకాల పిండి వంటలకు చాలా ఫేమస్. ఈ జిల్లాలో చాలా మందికి పండక్కి ఇళ్లంతా రకరకాల పిండి వంటలతో నింపేస్తుంటారు. వీటి రుచులలో వేటికవే భిన్నం. అయితే, ఎక్కువ మంది కొత్త పంట బియ్యంతో "కొబ్బరి పాకుండలు" చేస్తుంటారు. కొంతమందికి ఇవి చేయడం సరిగా రాదు. నూనెలో వేయగానే పగిలిపోతుంటాయి. అయితే, కొన్ని టిప్స్ పాటిస్తూ పాకుండలు ఈ స్టోరీలో చెప్పిన విధంగా చేస్తే ఎంతో క్రిస్పీగా గుల్లగుల్లగా వస్తాయి. మరి ఇక ఆలస్యం చేయకుండా నోరూరించే గోదావరి స్పెషల్ కొబ్బరి పాకుండలు ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం.
కావాల్సిన పదార్థాలు :
- రేషన్ బియ్యం కొత్తవి - 1 కేజీ
- బెల్లం తురుము - కప్పు (పావు కేజీ)
- యాలకుల పొడి - 1 టీస్పూన్
- గసగసాలు - 2 టేబుల్‌స్పూన్లు
- పచ్చికొబ్బరి తురుము - కప్పు
- నూనె - డీప్ ఫ్రైకి తగినంత
తయారీ విధానం :
- ముందుగా ఒక గిన్నెలో బియ్యాన్ని తీసుకొని శుభ్రంగా కడిగి కనీసం 18 గంటలపాటు నానబెట్టుకోవాలి. ఆపై మరోసారి బియ్యాన్ని కడిగి నీళ్లు లేకుండా వడకట్టుకోవాలి. (ఇక్కడ రేషన్ బియ్యం వాడితే పాకుండలు మరింత రుచికరంగా, క్రిస్పీగా వస్తాయి)
- ఆ విధంగా వడకట్టిన బియ్యాన్ని ఫ్యాన్ కింద ఒక పొడి క్లాత్‌పై పలుచగా పరచి ఆరబెట్టుకోవాలి. బియ్యం డ్రైగా ఆరబెట్టుకోకుండా చేతితో పట్టుకుంటే కాస్త తడి తగిలేవిధంగా ఉండాలి.
- ఇప్పుడు మిక్సీ జార్లో ఆరబెట్టుకున్న బియ్యాన్ని కొద్దికొద్దిగా వేసుకొని మెత్తని పిండిలా గ్రైండ్ చేసుకోవాలి. ఆపై ఒక వెడల్పాటి ప్లేట్(బేషన్) తీసుకొని అందులో మిక్సీ పట్టుకున్న పిండిని జల్లించుకోవాలి.
- ఇప్పుడు స్టౌపై పాన్ పెట్టి బెల్లం తురుము, కొద్దిగా వాటర్ చల్లండి. ఆపై పాకం ముద్దపాకం వచ్చే వరకు కరిగించాలి. అయితే, పాకం పర్ఫెక్ట్గా వచ్చిందని తెలుసుకోవడానికి ఓ చిట్కా ఉంది.
- ముందుగా ఒక చిన్న బౌల్లో చల్లటి నీరు తీసుకొని అందులో గరిటెతో కొద్దిగా పాకాన్ని వేసుకుంటే అది మరీ ఉండకట్టకుండా చేతితో తీసుకుంటే కాస్త జారుడుగా ఉండాలి.
- ఇలా తయారైన పాకాన్ని స్టౌ ఆఫ్ చేసి 10 నిమిషాలు పక్కన పెట్టుకోండి.
- ఆపై ఇందులో గసగసాలు, పచ్చికొబ్బరి తురుము వేసి కలపండి.
- ఇప్పుడు ఆ పాకంలో ముందుగా మిక్సీ పట్టుకున్న తడి బియ్యప్పిండిని కొద్దికొద్దిగా వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే యాలకుల పొడి వేసి కలపండి.
- అయితే, పిండి కన్సిస్టెన్సీ అనేది సాఫ్ట్‌గా, ముద్దగా ఉండాలని గుర్తుంచుకోండి. ఇందులో అరిసెలకు వేసినట్లుగా నూనె, నెయ్యి వేయకూడదు. ఈ పిండిని 15 నిమిషాల పాటు చల్లారనివ్వాలి.
- అనంతరం చేతులకు నూనె రాసుకోండి. ఇప్పుడు నిమ్మకాయ సైజంత పిండిని చేతిలోకి తీసుకుని చిన్న ఉండలుగా చేసుకుని ఆయిల్ రాసిన ప్లేట్లో పెట్టుకోండి. ఇలా అన్ని ఉండలు రెడీ చేసుకోండి.
- ఆపై స్టౌపై కడాయి పెట్టుకొని నూనె వేసి వేడి చేసుకోవాలి. వేడివేడి నూనెలో సరిపడా పాకుండలు వేసి స్టౌ మీడియం ఫ్లేమ్‌లో అడ్జస్ట్ చేయండి.
- ఒక మూడు నిమిషాల తర్వాత అట్లకాడతో మెల్లిగా తిప్పుకోండి.
- పాకుండలు రెండు వైపులా ముదురు గోల్డెన్ కలర్లో వేగిన తర్వాత జల్లెడలోకి తీసుకోండి. ఇవి చల్లారిన తర్వాత ఎంతో క్రిస్పీగా ఉంటాయి.
- అలా మిగిలిన పాకుండలను నూనెలో వేయించి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి.
- అంతే ఇలా ఈజీగా చేసుకుంటే గోదావరి జిల్లాల స్పెషల్ కొబ్బరి పాకుండలు రెడీ!
- ఈ పాకుండలు నచ్చితే మీరు కూడా ఓ సారి ట్రై చేయండి
ఈ సంక్రాంతికి కూడా రొటిన్ స్వీట్లేనా? ఈ సారి వివిధ రాష్ట్రాల్లో చేసే స్పెషల్ స్వీట్లను చూద్దాం!
కజ్జికాయలు పీటలేకుండానే చేతులతో వత్తేయండిలా - నిమిషానికి ఒకటి చేసేస్తారు!