Khammam Girl Four Govt Jobs 2024 :అమ్మానాన్న పెళ్లి చేస్తామంటే ప్రభుత్వ ఉద్యోగం సాధించాకే అని కచ్చితంగా చెప్పేసింది ఈ యువతి. లక్ష్యాన్ని చేరుకునేందుకు ఆరు ఏళ్ల పాటు అలుపెరుగకుండా పోరాడింది. ఉద్యోగ నోటిఫికేషన్లు ఉన్నా, లేకున్నా సాధన మాత్రం మానలేదు. ఎన్నో ఓటములూ, అవమానాలనూ దాటుకుని, ఎట్టకేలకూ విజయాల బాట పట్టింది. ఈసారి రాసిన ప్రతీ పరీక్షలోనూ ఎంపికయ్యి, నాలుగు సర్కారీ కొలువులు సంపాదించి ఆశయాన్ని నెరవేర్చుకుంది. నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన ఈ యువతి పేరు శృతి. స్వస్థలం ఖమ్మం. తండ్రి ప్రభాకర్ పెయింటింగ్ పని చేస్తుంటారు. తల్లి పూలమ్మ ఖమ్మం పోలీస్ శిక్షణా కేంద్రంలో వంటమనిషిగా పనిచేస్తోంది.
ఒకేసారి 4 సర్కారీ కొలువులు :ఇంటర్ వరకూ గురుకులాల్లోనే చదువు పూర్తిచేసింది శృతి. అమ్మానాన్నల కష్టం చూస్తూ పెరిగిన ఈమె, డిగ్రీ చదివేటప్పుడే ప్రభుత్వ ఉద్యోగంపై గురి పెట్టింది. ఉద్యోగం దక్కించుకునే వరకూ వివాహ ప్రస్తావన తీసుకురావద్దని తల్లిదండ్రులను ఒప్పించి, ఆరు ఏళ్లపాటు సుదీర్ఘంగా శ్రమించింది. ఇప్పుడు ఒకేసారి 4 సర్కారీ కొలువులు దక్కించుకుని ఔరా అనిపిస్తోంది. 2018 నుంచి పోటీపరీక్షలకు చదవడం మొదలుపెట్టానని, లాక్‌డౌన్ సమయంలోనూ ఇంటినే లైబ్రరీగా మార్చుకుని ఆపకుండా సాధన చేశానని చెబుతోంది శృతి. మొదట్లో ఒకటి, రెండు మార్కుల తేడాతో ఉద్యోగాలు కోల్పోయినా నిరుత్సాహపడకుండా లోపాలను సరిచేసుకుంటూ ప్రణాళికతో చదివి ఇన్ని ఉద్యోగాలు సంపాదించానని అంటోంది.
'నేను ఆరు నుంచి పదో తరగతి వరకు గురుకుల పాఠశాలలో చదివాను. ఇంటర్మీడియట్ ఖమ్మంలో బీఆర్ అంబేడ్కర్ జూనియర్ కళాశాలలో చేశాను. గ్రాడ్యుయేషన్ మ్యాక్స్ కళాశాలలో ఫార్మసీ చేశాను. తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో సోషియాలజీ చేశా. అందులోనే మాస్టర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ కూడా చేశాను.' - కోలపూడి శృతి.