Karthika Masam 2024 :పరమ పవిత్రమైన కార్తిక మాసం గోదావరి పుణ్యస్నానాలకు ప్రాధాన్యత సంతరించుకునే మాసం. ఇవాళ్టి(శనివారం) నుంచి ప్రారంభం కానుడటంతో భక్తులు ఆధ్యాత్మిక భావంతో నెల రోజుల పాటు గోదావరి పుణ్యస్నానాలు, ఉపవాస దీక్షలు చేయనున్నారు. గోదావరిలో పుణ్యస్నానాలు చేసి ప్రవాహంలో దీపాలు వెలిగించి వదలడం, తీరం ఒడ్డున సైకత లింగాలను తయారు చేసి కుంకుమ, పసుపుతో పూజించడం, ఆలయంలో ఉసిరి చెట్టు కింద మట్టితో చేసిన దీపాలను వెలిగిస్తారు. ఇలా చేయడం వల్ల సకల శుభాలు జరుగుతాయని భక్తుల నమ్మకం.
కార్తిక స్నానాలతో సకల పాప విముక్తి :వేద పండితులకు దీపదానం చేయడం వల్ల కుటుంబాల్లో అంధకారం తొలిగి సకల శుభాలు జరుగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఆలయాల్లో ఆకాశదీపం దర్శించుకోవడం, తులసి కల్యాణం, సత్యనారాయణ వ్రతాలను భక్తులు నిర్వహిస్తారు. ప్రధానంగా బ్రహ్మ ముహూర్త సమయంలో త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరిస్తే మానవ జీవితంలోని సర్వపాపాలు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం.
కాళేశ్వరాలయం :కార్తిక మాసంలో శివుడికి అత్యంత ఇష్టమైన లక్షబిల్వమారేడు పూజను భక్తులు నిర్వహిస్తారు. ఉత్తర తెలంగాణలో ప్రసిద్ధిగాంచిన కాళేశ్వరం ఆలయంలో అధికారులు లక్ష బిల్వార్చనకు రూ.6,000గా నిర్ణయించారు. సాయంకాలం సమయంలో సుమారు 12 మంది అర్చకులు ఈ పూజాకార్యక్రమాల్లో పాల్గొంటారు.
- భక్తులకు ఉదయం నుంచి సాయంత్రం వరకు లడ్డూ, ప్రసాదాలు అందేలా దేవస్థానం అధికారులు ప్రత్యేక ఏర్పాటు చేయాలి.
- భక్తులు నిత్యం తెల్లవారుజామున 4 గంటల సమయంలో, రాత్రి సమయంలో పుణ్యస్నానాలు ఆచరించడానికి వస్తుంటారు. గోదావరి ఒడ్డున దీపాలు ఉన్న ప్రవాహం మెట్ల వద్ద నుంచి దూరంగా వెళ్లడం వల్ల చీకటిమయం అయ్యింది. అధికారులు వెలుగులు ప్రసరించేలా ఏర్పాట్లు చేయాలని భక్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.
- 30 రోజుల పాటు సుదూర ప్రాంతాల నుంచి భక్తులు ఇక్కడకు వస్తుంటారు. ప్రయాణ ప్రాంగణం నుంచి గవర్నమెంట్ స్కూల్ వరకు ప్రధాన రహదారి ఇరుకుగా ఉంటుంది. భక్తుల వాహనాలను రహదారికి ఇరువైపులా నిలపడం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పోలీసుశాఖ ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
- కాళేశ్వర క్షేత్రం శుభ కార్తిక మాసానికి ముస్తాబవుతోంది. 30 రోజుల పాటు ఆలయ ఆవరణ అంతా దీపోత్సవ కాంతులతో మెరిసిపోనుంది. ప్రధాన ఆలయంతో పాటు రాజగోపురాలకు విద్యుత్తు దీపాలను అమర్చారు.
గోదావరి తీరాన శోభాయమానంగా కార్తిక వెలుగులు
కార్తిక పుణ్య స్నానాలు, శివనామ స్మరణతో శైవక్షేత్రాలు