Kargil Vijay Diwas 2024 : భారత్, పాకిస్థాన్ మధ్య జరిగిన కార్గిల్ యుద్ధంలో విజయం సాధించి 25ఏళ్లు పూర్తైన సందర్భంగా రాష్ట్రంలో 'విజయ్ దివస్'ను ఘనంగా నిర్వహించారు. పలు చోట్ల జాతీయ జెండాలతో రాజకీయ పార్టీల నేతలు, విద్యార్థులు ప్రదర్శన చేపట్టారు. విపత్కర పరిస్థితుల్లోనూ దేశరక్షణకు అంకితమవుతున్న సైనికుల సేవల్ని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ కొనియాడారు. కార్గిల్ యుద్ధంలో వందలాది మంది భరతమాత ముద్దుబిడ్డలు దేశ రక్షణలో భాగంగా అమరులయ్యారని గుర్తుచేసుకున్నారు.
పలు జిల్లాల్లో ఘనంగా కార్గిల్ విజయ్ దివస్ :కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా ఆదిలాబాద్ మున్సిపల్ పార్కులోని స్తూపం వద్ద అమర వీరులకు జాయింట్ కలెక్టర్ శ్యామలాదేవి నివాళులు అర్పించారు. అనంతరం ఎన్‌సీసీ విద్యార్థులు, బీజేపీ, హిందూ ఉత్సవ నాయకులు పుష్పాంజలి ఘటించి రెండు నిమిషాలు మౌనం పాటించారు. నిజామాబాద్ జిల్లా బోధన్‌లో బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో జెండా ర్యాలీని నిర్వహించారు. కార్గిల్ యుద్ధంలో అమరులైన వీరుల పేర్లతో నినాదాలు చేశారు.
కార్గిల్ యుద్ధవీరులకు నివాళులు :500 మీటర్ల జాతీయపతాకాన్ని భుజాలపై మోసి ఊరేగించారు. బోధన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎన్‌సీసీ విద్యార్థులు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. సిద్దిపేట జిల్లా ట్రస్మా ఆధ్వర్యంలో పట్టణంలోని బీజేఆర్ చౌరస్తా నుంచి పాత బస్టాండ్ వరకు స్కూల్ విద్యార్థులు, పోలీసులు విజయ దివాస్ ర్యాలీ నిర్వహించారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో మాజీ సైనికులు కార్గిల్ అమరులకు నివాళులు అర్పించారు.