Kamareddy Govt Hospital Issue : కామారెడ్డి జిల్లా ఆసుపత్రిలో ఎలుకలు రోగులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. గతంలో వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలోనూ మూషికాల బెడద చర్చనీయాంశమైంది. తాజాగా కామారెడ్డి జిల్లా హాస్పిటల్ ఐసీయూలో రోగిని ఎలుకలు గాయపర్చడంపై ఉన్నతాధికారులు తీవ్రంగా స్పందించారు. ఘటనకు బాధ్యులుగా చేస్తూ ఇద్దరు వైద్యులు, ఒక స్టాఫ్ నర్సును సస్పెండ్ చేశారు. ఆసుపత్రి పర్యవేక్షకురాలిని విధుల నుంచి తప్పించారు. ఎలుకల సంచారం లేకుండా గట్టి చర్యలు తీసుకోవాలంటూ ఆదేశాలు జారీ చేశారు.
ఐసీయూలో చికిత్స పొందుతున్న రోగిని కరిచిన ఎలుకలు - కాళ్లు, చేతులకు తీవ్ర రక్తస్రావం
Rat Infestation Government Hospital In Kamareddy : ఈ వ్యవహారంలో అధికారులు, వైద్యుల మధ్య వివాదం ఏర్పడింది. నిర్వహణ లోపాలకు తమను బాధ్యులుగా చేయడం ఏంటంటూ వైద్యులు కామారెడ్డి జిల్లా ఆసుపత్రి ఎదుట నిరసన తెలిపారు. తగిన సౌకర్యాలు, సిబ్బంది లేకపోయినా మెరుగైన సేవలందిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో వైద్యారోగ్య శాఖ మంత్రి రాజనర్సింహను కలిసి సస్పెన్షన్ ఎత్తేయాలని విన్నవించారు.
"కామారెడ్డి ఆసుపత్రిలో డాక్టర్లు, స్టాఫ్ నర్స్ విధిగా ప్రతిరోజు రౌండ్స్ తిరుగుతారు. ఎలుక బెడద నివారించడానికి సూపరింటెండెంట్, వైద్యులను ఎగ్జామిన్ చేశాం. ఆసుపత్రిలో నిర్మాణ పనులు జరుగుతున్నాయి. రోగులు తిను బండారాలు అక్కడక్కడ పడేయడం వల్ల ఎలుకల బెడద పెరిగింది."-డా.అజయ్ కుమార్, కమిషనర్, వైద్య విధాన పరిషత్