AP Govt Transfers Kadapa SP over YSRCP Activist Case :ఏపీలోని కడప ఎస్పీ హర్షవర్ధన్ రాజును రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. అనంతరం అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్‌కు కడప ఎస్పీగా అదనపు బాధ్యతలు అప్పగించింది. వైఎస్సార్ జిల్లా పులివెందులకు చెందిన వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీంద్రారెడ్డి అసభ్యకర పోస్టులు చేస్తున్నారంటూ ఫిర్యాదులు వచ్చినా చర్యలు తీసుకోకుండా అతణ్ని విడిచిపెటడంతో ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో కడప ఎస్పీని బదిలీ చేయగా అదే జిల్లాలోని మరో సీఐను సైతం సస్పెండ్ చేసింది. వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీంద్రారెడ్డి చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేశ్ అనితకు వ్యతిరేకంగా హేయమైన రీతిలో సామాజిక మాధ్యమాల్లో పోస్టులు చేస్తుండేవారు.
గత ప్రభుత్వంలోనే విచ్చలవిడిగా ప్రతిపక్షాలపై అసభ్యకరమైన పోస్టులు పెట్టిన వర్రా రవీంద్రారెడ్డి, ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలోనూ వాటిని కొనసాగిస్తూనే ఉన్నారు. కడప ఎంపీ అవినాష్ రెడ్డికి ముఖ్య అనుచరుడిగా వర్రా రవీంద్రారెడ్డి ఉన్నారు. ఏపీలో కడప తాలూకా పోలీసులు బుధవారం తెల్లవారుజామున వర్రా రవీంద్రారెడ్డికి 41-ఏ నోటీసులు ఇచ్చి విడిచిపెట్టారు. ఈ నేపథ్యంలో దీనిపై చంద్రబాబు, డీజీపీ ద్వారకా తిరుమలరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో కడపలోని ఎస్పీ కార్యాలయానికి కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ చేరుకుని వర్రా రవీంద్రారెడ్డి కేసుపై ఆరా తీశారు.
పరారీలో వర్రా రవీంద్రారెడ్డి : మరోవైపు వర్రా రవీంద్రారెడ్డిని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు మళ్లీ ప్రయత్నించగా అప్పటికే ఆయన తప్పించుకున్నారు. దీంతో కుటుంబ సభ్యలను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. రవీంద్రారెడ్డిని పట్టుకునేందుకు పోలీసులు యత్నిస్తున్నారు. ఇవాళ రాత్రి లేదా రేపటిలోగా ఆయనను అదుపులోకి తీసుకుంటామని పోలీసులు చెప్పారు. రవీంద్రారెడ్డిపై సుమారు 30 వరకు కేసులు నమోదై ఉన్నాయని పోలీసుల వర్గాలు వెల్లడించాయి. ఈ ఘటనపై ఇంటెలిజెన్సీ నివేదికను కూడా సైతం ఏపీ ప్రభుత్వం కోరినట్లు సమాచారం.