తెలంగాణ

telangana

ETV Bharat / state

'కేసీఆర్ చెప్పిన విధంగానే 'కాళేశ్వరం' నిర్మాణం - ఆయన ఎలా చెబితే అలా చేశాం'

విశ్రాంత ఈఎన్‌సీ నల్లా వెంకటేశ్వర్లును ప్రశ్నించిన జస్టిస్ పీసీ ఘోష్ - కాళేశ్వరం ప్రాజెక్టు డీపీఆర్‌ నిర్ణయాలపై ప్రశ్నించిన కమిషన్ ​- అప్పటి సీఎం నిర్ణయాల మేరకే ముందుకెళ్లినట్లు స్పష్టం

INQUIRY ON KALESHWARAM PROJECT TODAY
Justice PC Ghose Commission Inquiry on Kaleshwaram (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : 4 hours ago

Justice PC Ghose Commission Inquiry on Kaleshwaram : అప్పటి ముఖ్యమంత్రి ఆలోచన మేరకు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం జరిగిందని, ప్రభుత్వాధినేత ఆదేశాల మేరకే మేడిగడ్డ ఆనకట్టలో నీరు నిల్వ చేసినట్లు విశ్రాంత ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు తెలిపారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టలకు సంబంధించిన అంశాలపై విచారణ చేస్తున్న కమిషన్, ఇవాళ మరోమారు ఆయనను ప్రశ్నించింది. గత విచారణకు కొనసాగింపునకు నల్లా వెంకటేశ్వర్లును జస్టిస్ పీసీ ఘోష్ క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. రెండు విడతలుగా చేసిన విచారణలో 128 ప్రశ్నలు అడిగారు. కాళేశ్వరం ప్రాజెక్టు డీపీఆర్ తయారీ నిర్ణయం ఎప్పుడు, ఎవరు తీసుకున్నారని కమిషన్ ప్రశ్నించింది.

2016 జనవరిలో అప్పటి ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అధికారుల సమీక్షలో నిర్ణయం జరిగిందన్న వెంకటేశ్వర్లు, కాళేశ్వరం ప్రాజెక్టు ఆలోచన అప్పటి ముఖ్యమంత్రిదేనని, సమీక్షకు పిలిచే వరకు తమకు ఎలాంటి సమాచారం లేదని అన్నారు. డీపీఆర్ కేంద్ర జలసంఘం ఆమోదం పొందిన తర్వాత మార్పులు జరిగాయా అని జస్టిస్ ప్రశ్నించారు. నిర్మాణ ప్రాంత పరిస్థితి ఆధారంగా కేంద్ర జలసంఘం ఆమోదం పొందిన తర్వాత డీపీఆర్​లో మార్పులు జరిగాయన్న వెంకటేశ్వర్లు, ఉన్నతస్థాయి కమిటీ ఆదేశాల మేరకు మార్పులు జరిగాయని చెప్పారు. మూడు ఆనకట్టల నిర్మాణ స్థలాన్ని వ్యాప్కోస్ సంస్థ సూచించిందని తెలిపారు.

2 లక్షల ఎకరాల ఆయకట్టు కోసం అంత ఖర్చు చేస్తారా? : ప్రభుత్వ, అధికారుల ప్రమేయం లేకుండా వ్యాప్కోస్ ఎలా సూచిస్తుందని కమిషన్ ప్రశ్నించింది. పలు ప్రశ్నలకు సమాధానంగా అప్పటి ప్రభుత్వాధినేత నిర్ణయాల మేరకే ముందుకెళ్లినట్లు వెంకటేశ్వర్లు కమిషన్​కు తెలిపారు. ప్రాణహిత - చేవేళ్ల పనుల కోసం ఖర్చు చేసిన రూ. 16 వేల కోట్లు వృథా చేయడం ఏ మేరకు సబబని ప్రశ్నించిన కమిషన్, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం కాదా అడిగింది. అప్పటి ప్రభుత్వం విధానపర నిర్ణయం తీసుకొందని వెంకటేశ్వర్లు తెలిపారు. కేవలం 2 లక్షల ఎకరాల అదనపు ఆయకట్టు కోసం ఇంత పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తారా? అని కమిషన్ ప్రశ్నించింది.

తమ్మిడిహట్టి నుంచి తక్కువ విద్యుత్‌, రెండు లిఫ్ట్‌లతోనే నీరు వచ్చేది కదా అన్న కమిషన్, మూడు లిఫ్ట్‌లు, భారీ మొత్తంలో విద్యుత్‌ ఉపయోగించాల్సిన అవసరం ఏముందని అడిగింది. తమ్మిడిహట్టి వద్ద నీటి లభ్యత లేదని, అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని ప్రభుత్వం నిర్ణయం తీసుకొందని వెంకటేశ్వర్లు వివరించారు. రెండు లక్షల అదనపు ఆయకట్టుతో పాటు 18 లక్షల ఎకరాలకు పైగా స్థిరీకరణ కూడా ఉందని తెలిపారు. విశ్రాంత ఇంజినీర్ల సూచనలను ఎందుకు పరిగణలోకి తీసుకోలేదని, ఉద్దేశపూర్వకంగా పక్కన పెట్టారా అని జస్టిస్ పీసీఘోష్ ప్రశ్నించారు. ఆ అంశం తనకు తెలియదని వెంకటేశ్వర్లు చెప్పారు.

డీపీఆర్ ఇచ్చేందుకు ఆరేళ్లు ఎందుకు పట్టింది :డీపీఆర్ సమర్పించేందుకు ఆరేళ్ల సమయం ఎందుకు పట్టిందని, కేంద్ర జలసంఘం అనుమతులు లేకుండానే అదనపు టీఎంసీ పనులు ఎందుకు చేపట్టారని కమిషన్ అడిగింది. పైనుంచి ఉన్న ఆదేశాల మేరకు అదనపు టీఎంసీ పనులు చేపట్టినట్లు ఆయన చెప్పారు. ఎవరి ఆదేశాల మేరకు మేడిగడ్డలో నీరు నిల్వ చేశారన్న కమిషన్ ప్రశ్నకు సమాధానంగా ప్రభుత్వాధినేత ఆదేశాల మేరకు నీరు నిల్వ చేసినట్లు వెంకటేశ్వర్లు తెలిపారు.

మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు ప్రత్యేకమైనవని, పంప్ హౌస్​ల నుంచి నీటిని ఎత్తిపోసేందుకు వీలుగా నిర్మించిన ఆనకట్టలు అని పేర్కొన్నారు. ఓ దశలో నల్లా వెంకటేశ్వర్లుపై ఆగ్రహం వ్యక్తం చేసిన జస్టిస్ పీసీ ఘోష్, కమిషన్ ఎదుట హాజరైన విషయాన్ని గుర్తు పెట్టుకొని నిజాలు, డాక్యుమెంట్ల ఆధారంగా మాత్రమే చెప్పాలని స్పష్టం చేశారు. కమిషన్ ముందు నిరాధారమైన వ్యాఖ్యలు చేస్తే చర్యలు ఎదురుకోవాల్సి వస్తుందని అన్నారు. రేపు మళ్లీ విచారణకు హాజరు కావాలని నల్లా వెంకటేశ్వర్లును కమిషన్ ఆదేశించింది.

'మేడిగడ్డ కుంగుబాటుకు కారణమేంటి? - ఏమో? తెలియదు గుర్తులేదు చెప్పలేను'

ABOUT THE AUTHOR

...view details