తెలంగాణ

telangana

ETV Bharat / state

విదేశాల్లో ఉద్యోగాల కోసం పాట్లు - గణనీయంగా తగ్గిన ఫారెన్​ జాబ్స్​ - Jobs Decreased in Foreign Countries - JOBS DECREASED IN FOREIGN COUNTRIES

Job Opportunities Decreased in Foreign : విదేశీ విద్య అనేది నేటి యువతరం కల. దానిని నేరువేర్చుకోవడానికి సప్త సముద్రాలు దాటి అమెరికా, బ్రిటన్‌, ఆస్ట్రేలియా, కెనడా అంటూ వివిధ దేశాలకు చేరుతుంటారు. రెండేళ్లు కష్టపడితే చాలు ప్రతిభకు తగ్గట్లు ఏదో ఒక మంచి ఉద్యోగం సంపాదించవచ్చు, లైఫ్‌ సెటిల్‌ అయిపోతుంది అనుకుంటారు. ఇలా చాలా మంది విద్యార్థులు అప్పులు చేసి మరీ అమెరికా విమానం ఎక్కుతుంటారు. కానీ, రోజులు మారాయి. గతంతో పోలిస్తే విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు తగ్గిపోయాయి. కనీసం ఇంటర్న్‌షిప్‌లు కూడా దొరకని పరిస్థితి నెలకొంది. ఇక ఉద్యోగం దొరక్కపోతే వీసా చిక్కులు ఎదుర్కొవాల్సిన పరిస్థితి. దీంతో కొంతమంది విద్యార్థులు స్వదేశీ బాట పడుతుంటే, మరికొందరు మాత్రం ఉద్యోగం రాక, కన్నవారికి ముఖం చూపెట్టుకోలేక బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. కొంతమంది నేరాలు చేయడానికి సైతం అలవాటు పడుతున్నారు. మరి ఎందుకు ఈ పరిస్థితి. అమెరికాతో పాటు వివిధ దేశాల్లో విదేశీ విద్యార్థులకు వచ్చిన కష్టాలేంటి ? తెలుగు విద్యార్థుల పరిస్థితి ఎలా ఉంది ? ఇప్పుడు చూద్దాం.

Job Opportunities Decreased in Abroad
Job Opportunities Decreased in Foreign (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : May 18, 2024, 10:50 PM IST

విదేశీ చదువులు ఉద్యోగం కోసం కష్టాలు - గణనీయంగా తగ్గిన ఫారెన్​ జాబ్స్​ (ETV Bharat)

Job Opportunities Decreased in Abroad : విదేశీ విద్య ఈ పేరు చెప్పగానే టక్కున గుర్తొచ్చే పేరు అమెరికా. ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన దేశాల గురించి మాట్లాడుకుంటే అమెరికా మెుదటి స్థానంలో ఉంటుంది. కేవలం ఆర్థిక, సైనిక, వైద్య రంగాల్లోనే కాదు కీలకమైన విద్య విషయంలోనూ అమెరికా చాలా పేరు ప్రఖ్యాతలు గడించింది. ముఖ్యంగా ప్రపంచంలోనే క్యూఎస్‌ వరల్డ్‌ ర్యాకింగ్స్ సాధించిన సంస్థలు ఇక్కడ చాలానే ఉన్నాయి. వీటిల్లో చదువుకోవడానికి ఏటా లక్షల మంది విద్యార్థులు వివిధ దేశాల నుంచి అమెరికా గడ్డపై కాలుపెడతారు. ఎన్నో ఆశలు, మరెన్నో ఆశయాలతో అక్కడికి వెళుతుంటారు.

అయితే అమెరికాలో ప్రస్తుతం ఉద్యోగాలు లేవు. ఇది అమెరికాలో కొత్త ఉద్యోగాల ఎంపిక 90 శాతం తగ్గింది. దీంతో చాలా మంది విద్యార్థులు ఏం చేయాలో పాలుపోక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అమెరికానే కాదు ఆస్ట్రేలియా, కెనడా, బ్రిటన్‌ లాంటి దేశాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొందని నిపుణులు చెబుతున్నారు. అమెరికాలో విద్య అభ్యసిస్తున్న వారిలో ఒకప్పుడు చైనా వారి సంఖ్య ఎక్కువగా ఉండేది. ఇప్పుడా స్థానాన్ని భారతీయులు భర్తీ చేస్తున్నారు. ఏడాదికి సగటున 2 లక్షల మందికిపైగా విద్యార్థులు అమెరికాలోని వివిధ యూనివర్సిటీల్లో అడుగుపెడుతున్నారు.

అమెరికా విద్యపై విద్యార్థుల మక్కువ :2023-24 కోసం 2 లక్షల 69 వేల మంది విద్యార్థులు నమోదు చేసుకున్నారు. 2022-23తో పోలిస్తే ఇది 35 శాతం ఎక్కువ. ఇందులో చాలా వరకు పీజీ కోసమే వెళ్లే వారు ఉన్నారు. 2021-22 సంవత్సరానికి సంబంధించి అమెరికా 2.61లక్షల విదేశీ విద్య వీసాలను ఇవ్వగా అందులో లక్ష మందికిపైగా భారత విద్యార్థులకు వీసాలు దక్కాయి. ఇది మెుత్తం వీసాలలో 30 శాతానికి పైమాటే. ఈ లెక్కలు చూస్తే చాలు భారతీయ విద్యార్థులకు అమెరికా విద్యపై ఎంత మక్కువ ఉందో. అయితే, ఇది నాణేనికి ఒకవైపు మాత్రమే. మరోవైపు అనేక సమస్యలు కూడా ఉన్నాయి.

భారతీయలు పెద్ద సంఖ్యలో వెళుతున్నారు కాని, ఇందులో ఎంతమంది విజయవంతంగా వారి చదువులను పూర్తి చేసుకుని ఉద్యోగాల్లో స్థిరపడుతున్నారన్నదే ప్రశ్నగా మారుతోంది. ఈ విషయంలో భారత విద్యార్థులే కాదు విదేశీ విద్యార్థులు సైతం గత మూడు నాలుగేళ్ల నుంచి తీవ్ర ఇబ్బందులనే చవి చూస్తున్నారని నిపుణులు చెబుతున్నారు. సగటున ఒక భారతీయ విద్యార్థి విదేశాల్లో విద్య కోసం 30 లక్షలకుపైనే ఖర్చుపెడుతున్నారు. దీనికోసం పొలాలు, భూములు తనఖా పెట్టడం, లేకుంటే రుణాలు తీసుకుని విదేశీ విద్యకోసం అగ్రరాజ్యం గడ్డపై అడుగుపెడుతున్నారు.

ఆశించిన స్థాయిలో ఉద్యోగాలు లేకపోవడం : కానీ విద్య పూర్తైన తర్వాత ఆశించిన స్థాయిలో ఉద్యోగాలు మాత్రం లభించడం లేదు. దీనికి ఉదాహరణే ఈ ఏడాది ప్రతిష్ఠాత్మక ఐవీ లీగ్‌ విశ్వవిద్యాలయాలతో పాటు ఈస్ట్‌ కోస్ట్‌, వెస్ట్‌ కోస్ట్‌కు చెందిన అనేక యూనివర్సిటీలకు చెందిన 400 మంది విద్యార్థులకు ఈ ఏడాది వేసవిలో ఇంటర్న్‌షిప్‌ కోసం అవకాశాలు దక్కకపోవడం. ఐవీ లీగ్‌లో ప్రతిష్ఠాత్మక హార్వర్డ్‌, యాలే, పెన్సిల్వేనియా లాంటి వర్సిటీలు ఉండటం గమనార్హం. ఇంటర్న్‌షిప్‌ దొరకని చాలా మంది విద్యార్థులకు ఉద్యోగం లభించే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. గతంలో ఇంటర్న్‌షిప్‌ లభిస్తే, అదే కంపెనీల్లో పర్మినెంట్‌ రోల్స్‌లో ఉద్యోగాలు పొందేవారు.

కొంతకాలంగా ఈ అవకాశం కన్పించని పరిస్థితి. దీంతో చాలా మంది విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడాల్సిన దుస్థితి నెలకొంది. హెచ్​1-B వీసా పొందడం అనేది అమెరికాలోని భారతీయ ఉద్యోగుల కల. అయితే, అది కలగానే మిగిలిపోతోంది. సాధారణంగా సంవత్సరానికి 85 వేల వీసాలను అమెరికా విడుదల చేస్తుంటుంది. కానీ, ఆప్లికేషన్లు మాత్రం లక్షల్లో వస్తాయి. ఇది కూడా లాటరీ ద్వారా ఎంపిక చేస్తారు. ఈ వీసాలను పొందడంలో భారతీయులు చాలా వరకు ముందంజలో ఉన్నారని నిపుణులు చెబుతున్నారు.

అమెరికాకు భారత్​ విద్యార్థుల సంఖ్య వేలల్లో నుంచి లక్షల్లో :అయినా విదేశీయులతో పోటీ పడి మరి దక్కించుకోవాలంటే చాలా కష్టమేనని చెప్పుకోవాలి. దీన్ని దక్కించుకోవాలంటే స్టడీ వీసాపై వెళ్లిన విద్యార్థి ఏదైనా అమెరికా గుర్తింపు పొందిన కంపెనీల్లో ఉద్యోగం సాధించి ఉండాలి. ఒకవేళ ఏ ఉద్యోగం రాకపోతే విద్యార్థులు వారి వీసాలను స్టెమ్‌ ఆప్ట్‌ వీసా ద్వారా పొడగించుకునే అవకాశం ఉంటుంది. చదువు పూర్తి చేసుకున్న విదేశీ విద్యార్థులు 12 నెలల ప్రాక్టికల్ ట్రైనింగ్‌తో పాటు అదనంగా 24 నెలల సమయాన్ని ఈ ప్రోగ్రామ్‌ ద్వారా పొందవచ్చు. ఈ ప్రోగ్రామ్ సైన్స్ అండ్‌ టెక్నాలజీ, ఇంజినీరింగ్‌తో పాటు పలు రంగాల్లో డిగ్రీలు పూర్తి చేసిన వారికి నైపుణ్యాలు, అనుభవం లాంటివి పెంచుకోవడానికి రూపొందించారు.

దీనిని ఆధారంగా చేసుకునే ఇప్పుడు చాలా మంది విద్యార్థులు ఉద్యోగం లేకున్నా అమెరికాలో వివిధ రకాల కోర్సులు చేస్తూ గడుపుతున్నారు. విదేశాల్లో విద్య అంటే చాలా మంది పార్ట్‌టైంలో ఏదో ఒక ఉద్యోగం చేసుకోవచ్చనే భ్రమలో ఉంటారు. గతంలో అమెరికాకు వచ్చే భారత విద్యార్థుల సంఖ్య వేలల్లో ఉంటే, ఇప్పుడు లక్షల్లోకి చేరింది. కేవలం ఇది మన దేశస్థుల సంఖ్యే. ఇంకా విదేశీయులు కూడా కలిపితే పార్ట్‌టైం ఉద్యోగాల కోసం పోటీపడే వారు ఎక్కువగానే ఉంటారు. చాలా మంది గ్యాస్‌ స్టేషన్లు, పెట్రల్‌ బంకులు, స్టోర్‌లలో పని చేస్తున్నారు. ఇంకొంత మంది డ్రైవింగ్‌ చేస్తూ ఎంతో కొంత సంపాదిస్తున్నారు.

విదేశాల్లో భారతీయులపై దాడులు : కానీ, చాలా వరకు ఇటీవల భారతీయులపై దాడులు జరుగుతున్నాయి. అమెరికన్లు నివసించే ప్రాంతాల్లో మన వాళ్లు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఏర్పడింది. పోనీ ఆఫ్‌ క్యాంపస్‌లో ఉద్యోగం చేసుకుందామంటే దానికి నిబంధనలు అడ్డంకిగా మారుతున్నాయి. అలా చేస్తూ పట్టుబడితే మళ్లీ విద్యార్థులు డిపోర్ట్‌ అయ్యే అవకాశం కూడా ఉంది. దీనికి తోడు పెరిగిన ధరలు, ద్రవ్యోల్బణం అమెరికాను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఓవైపు ఇజ్రాయెల్‌-హమాస్‌ యుద్ధం, రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం కారణంగా అమెరికాపై పెద్ద ఆర్థిక భారమే పడింది.

అమెరికాలో ప్రస్తుతం ఎన్నికల ఫీవర్‌ నడుస్తోంది. రానున్న నవంబర్‌లో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఇది కూడా విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇచ్చిన అమెరికన్‌ ఫస్ట్‌ అనే నినాదం ఉండనే ఉంది. ఎన్నికల్లో ట్రంప్‌ గెలిస్తే విదేశీ విద్యార్థులకు వీసా అవకాశాలకు తీవ్ర అంతరాయం కలిగే పరిస్థితి ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అంతేగాక స్థానికులను ఉద్యోగాల కోసం ఎక్కువగా ఎంపిక చేయాలని ఆయా కంపెనీలపై ఒత్తిడి కూడా పెరుగుతుంది.

దీనంతంటికి కారణం అమెరికా ఎన్నికలే. ఎందుకంటే గతేడాది ఆక్టోబర్‌ నుంచి పోలిస్తే ఈ ఏడాది ఏప్రిల్‌లోనే అమెరికన్లకు ఎక్కువగా ఉద్యోగాలు లభించాయి. ఈ పరిస్థితుల్లో భారతీయ విద్యార్థులకు అవకాశాలు కష్టమేనని నిపుణుల అభిప్రాయం. అమెరికా నుంచి చాలా మంది విద్యార్థులు తిరిగి స్వదేశ బాట పడుతుంటే మరికొందరు మాత్రం తల్లిదండ్రులకు ఏం చెప్పాలో తెలియక తీవ్రమనోవేదనకు గురవుతున్నారు. దీంతో ఆత్మహత్యలు, లేదా నేరాల బారిన పడుతున్నారు. అందుకు ఉదాహరణే ఇటీవల తప్పిపోయిన భారతీయ విద్యార్థి అరిజోనా జైలులో ప్రత్యక్షమవ్వడం.

పార్ట్‌ టైం, పుల్‌ టైం ఉద్యోగాలు లేవు : నేరం నిర్ధారణ కానప్పటికీ భారతీయ విద్యార్థులకు ఎదురైన ఇదో ఉదాహరణ అని నిపుణులు చెబుతున్నారు. మరికొన్ని సార్లు ఆత్మహత్యలకు కూడా పాల్పడుతున్నారు. అమెరికానే కాదు భారతీయులు ఎక్కువగా వెళ్లే బ్రిటన్‌, ఆస్ట్రేలియా, కెనడా లాంటి దేశాల్లోనూ పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయి. కెనడా వచ్చే మూడేళ్లలో అంతర్జాతీయ విద్యార్థులతో సహా తాత్కాలిక విదేశీ ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకోవాలని భావిస్తోంది. అందుకోసం నిబంధనలను కఠినతరం చేసింది. అంతర్జాతీయ విద్యార్థుల కోసం క్యాంపస్ వెలుపల పనిని, వారానికి 24 గంటల వరకే పరిమితం చేసింది.

అటు లండన్‌లో మాస్టర్స్ తర్వాత 2 ఏళ్ల పోస్ట్ వర్క్ పర్మిట్ ఇస్తారు. కానీ, ఈ రెండేళ్ల వర్క్ పర్మిట్ తర్వాత కూడా లండన్‌లో ఉండాలంటే మాత్రం అక్కడి ఎంప్లాయర్ స్పాన్సర్‌షిప్ ఇవ్వాలి. అలా స్పాన్సర్‌షిప్ ఇవ్వకుంటే మళ్లీ యువత టైర్ టూ వీసా తీసుకుంటున్నారు. దీనికి ఎవరూ ఎంప్లాయర్ స్పాన్సర్స్ ఇవ్వకపోవడంతో యువత 20 లక్షల రూపాయల వరకు వెచ్చిస్తున్నారు. ప్రస్తుతం లండన్‌లో పార్ట్‌ టైం, పుల్‌ టైం ఉద్యోగాలు దొరికే పరిస్థితి లేదు. ఇల్లు అద్దెకు దొరకక ఉద్యోగులు, విద్యార్థులు నానా ఇబ్బందులు పడుతున్నారు.

ప్రత్యామ్నాయ దేశాలవైపు మెుగ్గు :అటు ఆస్ట్రేలియా కూడా ఇదే పంథాను కొనసాగిస్తూ కీలకమైన వీసాలపై నిబంధనలను కఠినతరం చేసింది. అంతర్జాతీయంగా నెలకొన్న ప్రతిష్టంభనలే ప్రస్తుత పరిస్థితులకు కారణమని నిపుణలు అంచనా వేస్తున్నారు. లక్షలు పోసి విదేశాల్లో విద్య అభ్యసిస్తున్నా ఆశించిన స్థాయిలో ఉద్యోగాలు లేకపోవడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బంది పడే పరిస్థితి. అయితే, అంతా అమెరికా బాట పట్టడం కూడా మంచిది కాదని చాలా మంది నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఎందుకంటే లక్షల మంది విద్యార్థులు ఒకే దేశం నుంచి వెళ్తుండటం ఒకే ప్రాంతంలో పెద్ద ఎత్తున స్థిర పడుతుంటడం కూడా ఆ దేశంలోని స్థానికులను కాస్త ఇబ్బందికి గురి చేసే పరిణామమే. గతంలో స్థిరపడిన వారు అయితే ఎలాగోలా నెట్టుకురావచ్చు. కానీ, కొత్తగా విదేశాల బాట పట్టేవారు ప్రత్యామ్నాయ దేశాలవైపు మెుగ్గు చూపాలని కోరుతున్నారు. అదే విధంగా స్వదేశంలో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచిస్తున్నారు. మరి ఇవన్నీ చూసిన తర్వాతైనా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు విదేశీ విద్య విషయంలో పంథాను మార్చుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు హితవు పలుకుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details