Jitender To Be Appointed As Telangana New DGP: తెలంగాణ డీజీపీగా సీనియర్ ఐపీఎస్ అధికారి జితేందర్ నియామకం దాదాపు ఖరారైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. నేడు ఇందుకు సంబంధించి ఉత్తర్వులు జారీ కానున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి మంగళవారమే ఉత్తర్వులు వెలువడాల్సి ఉన్నప్పటికీ, సీఎం మహబూబ్‌నగర్ జిల్లా పర్యటన కారణంగా వాయిదా పడినట్లు తెలిసింది.
ఈ ఉత్తర్వులు వెలువడితే, తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వం నియమించిన తొలి డీజీపీ జితేందర్ కానున్నారు. ప్రస్తుతం జితేందర్ డీజీపీ హోదాలోనే హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నారు. అలాగే విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ జనరల్‌గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్ర డీజీపీగా రవిగుప్తా బాధ్యతలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే
జితేందర్ ఉద్యోగ ప్రస్థానం:జితేందర్ పంజాబ్ రాష్ట్రం జలంధర్‌లో రైతు కుటుంబంలో జన్మించారు. ఈయన 1992 ఐపీఎస్ బ్యాచ్ అధికారి. ఏపీ కేడర్‌కు ఎంపికయ్యారు. తొలుత నిర్మల్ ఏఎస్పీగా పనిచేసి అనంతరం బెల్లంపల్లి అదనపు ఎస్పీగా విధులు నిర్వర్తించారు. అప్పట్లో నక్సల్స్ ప్రభావం ఎక్కువగా ఉన్న మహబూబ్‌నగర్, గుంటూరు జిల్లాల ఎస్పీగా కూడా విధులునిర్వహించారు.
2004-06 వరకు దిల్లీ సీబీఐ, గ్రేహౌండ్స్‌లో సైతం పనిచేశారు. అనంతరం డీఐజీగా పదోన్నతి పొంది విశాఖపట్నం రేంజ్‌లో బాధ్యతలు నిర్వర్తించారు. అప్పాలో కొంతకాలం పనిచేసి తెలంగాణ ఉద్యమం సమయంలో, వరంగల్ రేంజ్ డీఐజీగా విధులు నిర్వహించారు. ఏపీ సీఐడీ, ఎంక్వయిరీ కమిషన్, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌లో బాధ్యతలు నిర్వర్తించిన అనంతరం హైదరాబాద్ కమిషనరేట్‌లో ట్రాఫిక్ అదనపు కమిషనర్‌గా పనిచేశారు.