CM Revant Reddy Visit Yadadri : యాదాద్రిలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన సమయంలో కాసేపు గందరగోళం ఏర్పడింది. ముఖ్యమంత్రిని చూసేందుకు భారీగా తరలివచ్చిన ప్రజా ప్రతినిధులు, జిల్లా నాయకులు, కార్యకర్తలు సీఎంతో పాటు ఆలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో వారిని భద్రతా సిబ్బంది ఆపడంతో తోపులాట జరిగింది.
యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి తూర్పు రాజగోపురం ముందు నుంచి ప్రధాన ఆలయంలోకి వెళ్లారు. ఆ సమయంలో ఆయనతో ఉన్న కొందరు నాయకులు, కార్యకర్తలు కూడా లోనికి వెళ్లేందుకు ప్రయత్నించారు. వారికి అనుమతి లేదంటూ భద్రతా సిబ్బంది, పోలీసులు అడ్డుకున్నారు. తాము కూడా లోనికి వెళ్లాలంటూ వారంతా తోసుకురావడంతో కాసేపు ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది.
మంత్రులకు సైతం తిప్పలు : ఈ సమయంలో సీఎంతో పాటే వస్తున్న మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు కూడా ఆలయం లోనికి వెళ్లేందుకు కాస్త ఇబ్బంది పడాల్సి వచ్చింది. పోలీసులు కార్యకర్తలను నియంత్రించి అతి కష్టం మీద మంత్రులను లోనికి పంపించారు. చివరకు పోలీసులు క్యూలైన్ గేట్లు మూసేసి కార్యకర్తలను అడ్డుకున్నారు. అప్పటికే కొందరు నాయకులు, కార్యకర్తలు లోనికి బలవంతంగా వెళ్లారు.
రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో తన పుట్టినరోజు సందర్భంగా యాదాద్రి ఆలయానికి వచ్చారు. దీంతో ఉమ్మడి నల్గొండ జిల్లా, ఇతర ప్రాంతాల నుంచి భారీగా ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు యాదాద్రికి తరలివచ్చారు. దీంతో ఆలయం కిక్కిరిసిపోయింది. దర్శనం అనంతరం ముఖ్యమంత్రి వైటీడీఏ (యాదాద్రి టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ) అధికారులతో సమీక్ష నిర్వహించారు. యాదాద్రి పేరును యాదగిరి గుట్టగా మార్చాలని, టీటీడీ తరహాలో ఆలయ బోర్డు ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆలయ గర్భగుడి గోపురానికి బంగారు తాపడం పనులను వెంటనే చేపట్టాలని సూచించారు. వచ్చే బ్రహ్మోత్సవాలకు స్వర్ణ తాపడం పనులు పూర్తి చేయాలని అన్నారు.
యాదగిరిగుట్టగా మారనున్న యాదాద్రి, టీటీడీ తరహాలో టెంపుల్ బోర్డు - వైటీడీఏ సమీక్షలో సీఎం ప్రకటన
యాదాద్రి దర్శనానికి వెళ్తున్నారా? అయితే వెళ్లేముందు ఈ నిబంధనలు తెలుసుకోండి