Jagan Government Illegal Sand Mining Scandal :తమిళనాడులో ఇసుక కుంభకోణం ప్రకంపనాలు సృష్టిస్తోంది. కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ నేరుగా రంగంలోకి దిగింది. ఇసుక రీచ్‌లు, స్టాక్ పాయింట్లలో తనిఖీలు చేపట్టింది. సంబంధిత గుత్తేదారు సంస్థలపై దాడులు చేసింది. ఇసుక కుంభంకోణంలో రూ. 4,730 కోట్ల దోపిడీ జరిగినట్లు ఈడీ వెలుగులోకి తెచ్చింది.
అక్రమాలను అడ్డుకోని పది జిల్లాల కలెక్టర్లను విచారణకు రావాలంటూ నోటీసులిచ్చింది. అక్కడి ‘ముఖ్య’ నేత బంధువు ఒకరు దందాకు కీలక సూత్రధారి అనే ఆరోపణలున్నాయి. ఈడీ రంగంలోకి దిగడంతో అక్కడి నేతలు హడలిపోతున్నారు. కానీ అంతకుమించి ఇసుక దోపిడీ రాష్ట్రంలో జరుగుతోంది. కేంద్ర దర్యాప్తు సంస్థలు ఒక్కసారి ఇటువైపు చూడాలే గానీ అంతకుమించి అక్రమాలు బయటపడతాయి.
వైసీపీ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి రాష్టంలో ఇసుక దోపిడీకి (Sand mining scam in AP) అంతే లేకుండా పోయింది. సుప్రీంకోర్టు, హైకోర్టు, ఎన్జీటీ ఆదేశించినప్పటికీ ఇసుక తవ్వకాలు ఆగడం లేదు. రాష్ట్రంలో ఇసుక తవ్వకాలకు ఎలాంటి డిజిటల్ పత్రాలు ఉండవు డిజిటల్ పేమెంట్లు ఉండవు. రాతకోతలన్నీ చేతితోనే నేరుగా డబ్బులు ఇచ్చిన వారికే ఇసుక విక్రయాలు. కేంద్ర దర్యాప్తు సంస్థల చూపు ఒక్కసారి రాష్ట్రంపై పడిందా బినామీ సంస్థలు, వాటి వెనక ఉన్న సూత్రధారులు బయటకొస్తారు.
వచ్చే ఎన్నికల్లో జగన్ ఏం చేసినా గెలవడు - ప్రశాంత్ కిశోర్ సంచలన వ్యాఖ్యలు
ఎన్జీటీ ఆదేశాలు బేఖాతరు:
- తమిళనాడులో: 2022 మే నుంచి 2023 సెప్టెంబరు వరకు ప్రభుత్వం ఇసుక తవ్వకాలు, విక్రయాలు జరిపింది. దీన్ని నేరుగా జలవనరులశాఖే పర్యవేక్షించింది. వివిధ నదుల్లోని పలు రీచ్‌ల్లో కలిపి మొత్తం 195 హెక్టార్లలో ఇసుక తవ్వకాలకు అనుమతిస్తే ఏకంగా 987 హెక్టార్లలో ఇసుక తవ్వి, విక్రయించినట్లు ఈడీ తేల్చింది.
- ఏపీలో: జగన్ అధికారం చేపట్టక ముందు ఏపీఎండీసీ(APMDC) ద్వారా ఇసుక వ్యాపారం జరిగేది. ఆ తర్వాత 2021 మే 15 నుంచి ప్రైవేటు సంస్థల పేరిట జరుగుతోంది. అవి పర్యావరణ అనుమతులతో సంబంధం లేకుండా ఇష్టారాజ్యంగా ఇసుక తవ్వేస్తున్నాయి. 110 రీచ్‌ల్లో ఇసుక తవ్వకాలు ఆపేయాలని స్వయంగా ఎన్జీటీ ఆదేశించినా పట్టించుకోలేదు.
చేతి రాతతోనే బిల్లులు:
- తమిళనాడులో: ఇసుక తవ్వి, స్టాక్‌పాయింట్లకు తరలించే బాధ్యత మాత్రమే ప్రైవేటు సంస్థలకు అప్పగించారు. కానీ ఇసుక తవ్వకాలు మొదలుకొని రవాణా, విక్రయాలు సహా అన్నీ ఆ ప్రైవేటు సంస్థలే నడిపించాయి. జలవనరులశాఖ పేరిట ఆన్‌లైన్ వే బిల్లులు జారీ చేయాలి. కానీ ప్రైవేటు సంస్థలు నకిలీ బిల్లులు జారీ చేసి దోపిడీకి తెగబడ్డాయి.
- ఏపీలో: మాత్రం తొలుత ఏపీఎండీసీ ఆధ్వర్యంలో ఇసుక వ్యాపారం జరిగినప్పుడు ఆన్‌లైన్ వేబిల్లులే జారీ చేసేవారు. జేపీ సంస్థ వచ్చినప్పటి నుంచి చేతిరాత బిల్లులే ఇస్తున్నారు. వాళ్లు చెప్పిన ఇసుక లెక్కలే అధికారులు పరిగణనలోకి తీసుకునేలా ‘పెద్దలు’ చూశారు. దీంతో గుత్తేదారు సంస్థ తనకు నచ్చినన్ని వేబిల్లు పుస్తకాలు ముద్రించుకొని, దందా చేసింది.
వేల కోట్లలో దోపిడీ:
- తమిళనాడులో: ఇసుక కుంభకోణం ద్వారా ప్రభుత్వ ఖజానాకు 4వేల730 కోట్ల నష్టం వాటిల్లినట్లు ఈడీ లెక్కలు తేల్చింది.
- ఏపీలో: గుత్తేదారు సంస్థకు 24 నెలలు మాత్రమే ఇసుక తవ్వకాలకు అనుమతులు ఉంటే ఏకంగా 30 నెలలు తవ్వేసుకున్నారు. పైగా 1,528 కోట్లకు గానూ 1,059 కోట్లే చెల్లించింది. మిగిలిన సొమ్ము ఇవ్వకుండా ప్రభుత్వ పథకాలకు సరఫరా చేసిన ఇసుక లెక్కలు తేల్చాలంటూ ఎదురుతిరిగింది. అయితే అనుమతికి మించి కోట్ల టన్నుల అక్రమంగా తవ్వి, అమ్ముకుని భారీగా సొమ్ము చేసుకుందనేది బహిరంగ రహస్యం. మూడు నెలలుగా ఇసుక వ్యాపారం చేస్తున్న జీసీకేసీ, ప్రతిమ ఇన్‌ఫ్రా సంస్థలకు ఎంత మొత్తానికి టెండరు కట్టబెట్టారనేది ఇప్పటికీ చెప్పడం లేదు.