Police Investigation Afzalganj Fire Case :నగరంలో గురువారం కలకలం రేపిన అఫ్జల్‌గంజ్ కాల్పుల కేసులో పోలీసులు ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు. 10 స్పెషల్ టీమ్స్‌తో హైదరాబాద్ సహా రాయ్‌పూర్, బిహార్‌లోని అనుమానిత ప్రాంతాల్లో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. కాల్పులు జరిపింది బిహార్‌కు చెందిన అమిత్ కుమార్ ముఠాగా పోలీసులు గుర్తించినట్టు సమాచారం. కర్ణాటకలోని బీదర్‌లో దోపిడీకి పాల్పడి అక్కడ ఇద్దరిపై కాల్పులు జరిపి, హైదరాబాద్ నగరంలోకి ప్రవేశించి ఇక్కడి నుంచి రాయ్‌పూర్ మీదుగా పారిపోవాలని ప్రయత్నించినట్టు పోలీసులు దర్యాప్తులో గుర్తించారు.
ట్రావెల్స్ మేనేజర్‌పై కాల్పులు : ఈ ముఠా హైదరాబాద్‌కు ఎలా చేరుకుంది అనే అంశంపై పోలీసులు దృష్టి సారించారు. అఫ్జల్‌గంజ్‌లోని రోషన్ ట్రావెల్స్ మేనేజర్ జహంగీర్‌పై కాల్పులు జరిపింది బిహార్‌కు చెందిన అమిత్ కుమార్ ముఠాగానే పోలీసులు భావిస్తున్నారు. ఈ ముఠా రాయ్‌పూర్ మీదుగా బిహార్ పారిపోవాలని ప్రయత్నించినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. కాల్పులు జరిపిన ముఠా బిహార్ పారిపోయిందా? లేదా వేరే ఎక్కడికైనా వెళ్లి తలదాచుకున్నారా? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.
అమిత్ కుమార్ గ్యాంగ్ : ఈ ముఠాలో ప్రధానంగా అమిత్ కుమార్ కీలకంగా ఉన్నట్టు తెలిసింది. అతనిపై బిహార్‌లో దోపిడీలు, దొంగతనాల వంటి పలు కేసులు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. సీసీఎస్, టాస్క్‌ఫోర్స్, శాంతిభద్రతల విభాగం పోలీసులు నిందితుల ఆచూకీ కోసం వేట కొనసాగిస్తున్నారు. బిహార్ పోలీసులను సంప్రదించి నగర పోలీసు ఉన్నతాధికారులు అమిత్ కుమార్ నేరాల చిట్టా గురించి ఇప్పటికే పూర్తిగా తెలుసుకున్నట్టు తెలుస్తోంది.