IT Raids on Film Producer Dil Raju Office:హైదరాబాద్ నగరంలో సినీ ప్రముఖుల ఇళ్లలో రెండో రోజు ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. మంగళవారం తెల్లవారుజామున ఏకకాలంలో 55 ఐటీ బృందాలతో మొదలైన ఈ తనిఖీలు బుధవారం కూడా కొనసాగుతున్నట్లు ఐటీ వర్గాలు వెల్లడించాయి. 'సంక్రాంతికి వస్తున్నాం', 'గేమ్ ఛేంజర్' చిత్రాల నిర్మాత, తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ దిల్ రాజు ఇళ్లు, కార్యాలయాల్లో తనిఖీలు చేస్తున్నారు. ఐటీ సోదాలపై నిర్మాత దిల్‌రాజు స్పందించారు. ఐటీ సోదాలు తన ఒక్కడిపై జరగడం లేదని, ఇండస్ట్రీపై మొత్తం జరుగుతున్నాయని అన్నారు.
అదేవిధంగా పుష్ప-2 సినిమా నిర్మించిన మైత్రీ మూవీస్ నిర్వాహకులు యలమంచిలి రవిశంకర్, యన్నేని నవీన్, ఆ సంస్థ సీఈవో చెర్రి ఇళ్లలో ఆ సంస్థ కార్యాలయాల్లోనూ సోదాలు నిర్వహిస్తున్నారు. మరోవైపు మ్యాంగో మీడియా సంస్థ యజమానులు ఇల్లు, కార్యాలయాల్లో కూడా తనిఖీలు చేస్తున్నట్లు ఐటీ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే ఆయా సంస్థలకు చెందిన వ్యాపార లావాదేవీలను పరిశీలించిన ఐటీ బృందాలు బ్యాంకుల లావాదేవీలను కూడా పరిశీలిస్తున్నారు.