Irregularities in Selecting Companies for Internships in Degree And Engineering :డిగ్రీ, ఇంజినీరింగ్‌లలో ప్రవేశపెట్టిన ఇంటర్న్‌షిప్‌లకు కంపెనీలను ఎంపిక చేయడంలో కొందరు సిబ్బంది అక్రమాలకు తెర తీశారు. విద్యార్థులకు ఉచితంగా అందించాల్సిన ఇంటర్న్‌షిప్‌ను గత ప్రభుత్వ హయాంలో దాన్నో వ్యాపారంగా మార్చేశారు. ఆన్‌లైన్‌లో చేసే ఇంటర్న్‌షిప్‌కు సుమారు 300 వరకు సంస్థలు దరఖాస్తు చేసుకోగా వాటికి అనుమతులిచ్చేందుకు భారీగా వసూళ్లకు పాల్పడ్డారు. ఒక్కో అనుమతికి రూ.లక్ష నుంచి రూ.5 లక్షల వరకు తీసుకున్నట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
ఓ కంపెనీకి అనుమతి నిమిత్తం రూ.5 లక్షలకు ఒప్పందం కుదుర్చుకొని, కొంత మొత్తం తీసుకోవడంపై ఉన్నత విద్యామండలికి ఫిర్యాదు వచ్చింది. దానిపై విచారణ చేయించగా వాస్తవమని తేలడంతో చర్యలకు ఉపక్రమించారు. ఈ వ్యవహారంలో ఉన్నత విద్యామండలి వైస్ ఛైర్మన్ వద్ద పనిచేసే అటెండర్, ఉన్నత విద్య ప్రాజెక్టుల కోసం పని చేస్తున్న ఓ ప్రైవేటు సంస్థ ఉద్యోగిని తొలగించారు. ఈ అక్రమంలో వీరిద్దరే ఉన్నారా ఇంకా ఎవరైనా ఉన్నారా? అనే కోణంలో విచారణ సాగుతోంది.
గత ప్రభుత్వ నిర్ణయంతో : డిగ్రీ, బీటెక్‌లలో 10 నెలల ఇంటర్న్‌షిప్‌ను గత ప్రభుత్వంలో ప్రవేశపెట్టారు. మూడేళ్ల డిగ్రీలో మొదటి ఏడాది పూర్తయ్యే సమయంలో కమ్యూనిటీ ప్రాజెక్టు, రెండో ఏడాది చివరిలో రెండు నెలలు ఇంటర్న్‌షిప్, మూడో ఏడాదిలో ఒక సెమిస్టర్ ఇంటర్న్‌షిప్‌గా పెట్టారు. వీటికి సంబంధించి నేరుగా కంపెనీల్లో పని చేసే అవకాశం లేనందున ఎక్కువమంది విద్యార్థులు ఆన్‌లైన్‌లోనే చేస్తున్నారు. ఇంటర్న్‌షిప్ తప్పనిసరి చేయడంతో అది పూర్తయితేనే డిగ్రీ సర్టిఫికెట్ వస్తుంది.
దీన్ని ఆసరాగా చేసుకొని కంపెనీలు విద్యార్థుల నుంచి డబ్బు వసూళ్లకు పాల్పడుతున్నాయి. ఏటా రెండు, ఆరు నెలల ఇంటర్న్‌షిప్‌లకు కంపెనీలు ఉన్నత విద్యామండలి వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఈ ఏడాదికి సంబంధించి ఈ రిజిస్ట్రేషన్ ఈ నెల 22తో ముగిసింది. దాదాపు 300 దరఖాస్తులు వచ్చాయి. వాటిని పరిశీలించి, అనుమతులు ఇవ్వాల్సి ఉంది. ఈ ప్రక్రియను ఓ ప్రైవేటు సంస్థకు చెందిన సిబ్బందితోపాటు ఉన్నత విద్యామండలి అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ ప్రక్రియలో కొందరు వసూళ్లకు తెర తీశారు.