Student Died Due to Electric Shock at Hostel in Hyderabad : ఆ యువకుడు పదో తరగతి పాసయ్యాడు. ఇంటర్ చదువుల కోసమని చెప్పి కుమారుడిని తల్లిదండ్రులు కార్పొరేట్ కళాశాలలో జాయిన్ చేశారు. కేవలం నాలుగు రోజుల్లోనే తాను అక్కడ ఉండలేనంటూ అమ్మానాన్నల వద్ద బోరుమన్నాడు. అయితే మరో రెండు రోజులు చూడాలని, అప్పటికీ కాలేజీ నచ్చకపోతే తామే వచ్చి తీసుకెళ్తామని చెప్పారు. అప్పటి వరకు ఆగని ఆ కుర్రాడు, ఎలాగైనా ఇంటికి వెళ్లిపోవాలని హాస్టల్ ప్రహరీ గోడ దూకే క్రమంలో విద్యుత్ తీగలు తగిలి విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. ఈ హృదయ విదారక ఘటన హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
వివరాల్లోకి వెళితే ఏపీలోని గుంటూరు జిల్లా తెనాలికి చెందిన కర్రీ విజయ్‌కుమార్, చాముండేశ్వరి దంపతులు హైదరాబాద్ నగరానికి వచ్చి ఈస్ట్ మారేడుపల్లిలోని టీచర్స్ కాలనీలో నివాసం ఉంటున్నారు. వీరికి ఒక కుమార్తె, కుమారుడు గిరీష్ కుమార్ అరవంత్ ఉన్నారు. కుమారుడికి పదో తరగతి పూర్తి కావడంతో ఈ నెల 12న హయత్‌నగర్ సమీపంలోని కోహెడ నారాయణ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం ఎంపీసీలో చేర్పించారు.
ఈ నెల 16న ఆదివారం గిరీష్ కుమార్ తల్లిదండ్రులు, అక్క కలిసి హాస్టల్‌కు వెళ్లారు. తాను ఇక్కడ ఉండలేకపోతున్నానని వారితో చెప్పాడు. దీంతో ఆ తల్లిదండ్రులు మరో రెండు రోజులు చూడాలని, నచ్చకపోతే తీసుకెళ్తామని చెప్పి వెళ్లిపోయారు. ఈ క్రమంలో హాస్టల్లో ఉండడం ఇష్టం లేని గిరీష్ కుమార్, ఈ నెల 19న బుధవారం అర్ధరాత్రి తర్వాత 1.52 గంటల సమయంలో హాస్టల్ భవనం ఐదో అంతస్తు నుంచి కిందకు దిగాడు. అక్కడ కళాశాల ప్రాంగణం చుట్టూ ప్రహరీ ఉంది. దానిపై ఫెన్సింగ్ ఉంది.