Integrated Residential Schools Foundation In Telangana : రాష్ట్రంలో సరికొత్త గురుకులాలకు నేడు శ్రీకారం చుట్టనున్నారు. యంగ్ ఇండియా సమీకృత గురుకులాల నిర్మాణం ఇవాళ ప్రారంభం కానుంది. రాష్ట్రవ్యాప్తంగా 28 నియోజకవర్గాల్లో ఇవాళ పనులు మొదలు పెట్టనున్నారు. షాద్‌నగర్ నియోజకవర్గంలోని కొందుర్గ్ వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, జనరల్ గురుకులాలు ఉన్నాయి. అన్నింటినీ కలిపి ఒకే చోట సమీకృత సముదాయంగా నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
గురుకులాలకు నేడు శ్రీకారం :హైదరాబాద్ మినహా రాష్ట్రవ్యాప్తంగా 100 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సుమారు రూ.12 వేల కోట్లతో వీటిని నిర్మించాలని ప్రభుత్వం ప్రణాళిక రచించింది. మొదటి విడతలో స్థలాలు అందుబాటులో ఉన్న కొడంగల్, మధిర, హుస్నాబాద్, నల్గొండ, హుజూర్‌నగర్, మంథని, ములుగు, పాలేరు, ఖమ్మం, వరంగల్, కొల్లాపూర్, అందోల్, చాంద్రాయణగుట్ట, మంచిర్యాల, భూపాలపల్లి, అచ్చంపేట్, స్టేషన్ ఘన్‌పూర్, తుంగతుర్తి, మునుగోడు, చెన్నూరు, షాద్‌నగర్, పర్కాల, నారాయణ్ ఖేడ్, దేవరకద్ర, నాగర్ కర్నూల్, మానకొండూర్, నర్సంపేట నియోజకవర్గాలను ఎంపిక చేశారు.
మిగతా నియోజకవర్గాల్లోనూ స్థలాలను గుర్తించాలని అధికారులను ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ ఈ స్కూళ్లను నిర్మించనుంది. సుమారు 20 నుంచి 25 ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను నిర్మించనున్నారు. ఒక్కో పాఠశాల సముదాయానికి సుమారు రూ.100 నుంచి రూ.125 కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా. ఈ ఏడాది రూ.5 వేల కోట్లతో గురుకుల సముదాయాల నిర్మాణం ప్రారంభిస్తున్నారు.