తెలంగాణ

telangana

ETV Bharat / state

రూ.70కే లీటర్​ డీజిల్! - రూ.500కే అన్ని రకాల వైద్య పరీక్షలు!!

కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్న మాయగాళ్లు - అమాయకులే టార్గెట్​గా సాగుతున్న కేటుగాళ్ల దందా - గుడ్డిగా నమ్మి మోసపోతున్న అమాయకపు ప్రజలు

Online Scams Target the Innocent People
Online Scams Target the Innocent People (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : 4 hours ago

Online Scams Target the Innocent People :లీటర్​ డీజిల్ రూ.70కే ఇస్తామంటే గుడ్డిగా నమ్మడం, వేల రూపాయలు ఖర్చు అయ్యే వైద్య పరీక్షలకు రూ.500లకే చేస్తామంటే వెర్రిగా నమ్మేస్తూ కొందరు మాయగాళ్ల ఉచ్చులో పడుతున్నారు. తీరా అక్కడ జరుగుతున్న మోసాలు తెలుసుకున్నాక, ఇంత అమాయకంగా ఎలా నమ్మాను? ఇది కూడా తెలుసుకోలేకపోయానే అని బాధపడుతున్నారు. ఇలాంటివి కేవలం అత్యాశ, అవసరాలు, అమాయకత్వం ఉన్న వారిని మాత్రమే ఎంచుకొని మాయగాళ్లు కొత్త దందాకు పాల్పడుతున్నారు.

ఓ వ్యక్తి లీటర్ రూ.97గా ఉన్న డీజిల్​ను రూ.70కే ఇస్తామంటే ముందూ వెనకా ఆలోచించకుండా ఏపీలోని పల్నాడు జిల్లా సత్తెనపల్లి పట్టణానికి చెందిన బోర్​వెల్స్​ వ్యాపారులు కొనేశారు. తన వద్ద 1000 లీటర్ల డీజిల్ ఉందని, రూ.70 చొప్పున ఇస్తానని చెప్పడంతో పోటీపడీ మరీ పోగొట్టుకున్నారు. మన అవసరాన్ని ఆసరాగా చేసుకుని మోసగించేవారు మన చుట్టూనే ఉన్నారని చెప్పడానికి ఇదో చక్కని ఉదాహరణ.

మరో ఘటనలో వైద్య పరీక్షల పేరుతో మధుమేహం, రక్తపోటు, జీర్ణకోశ సమస్యలు పరీక్షిస్తామని చెప్పి మోసం చేశారు. నలుగురైదుగురు యంత్రాలతో వచ్చి రక్త పరీక్షలు చేసి మీ ఆరోగ్య సమస్యలు ఏంటో చెబుతామంటూ నమ్మించారు. రూ.4 వేల నుంచి రూ.5 వేలు అయ్యే వైద్య పరీక్షలు రూ.500కే చేస్తామని చెప్పి రక్తం తీసుకొని పత్తాలేకుండా పరారయ్యారు. ఇది కూడా సత్తెనపల్లిలో జరగడం విశేషం. ఈ మోసాలు రెండు పల్నాడు జిల్లాలోనే జరిగాయి.

అప్రమత్తతే శ్రీరామ రక్ష : ఇలాంటి మాయగాళ్లకు మాటలే పెట్టుబడి, అత్యాశే రాబడి. మన మధ్యనే తిరుగుతూ కొందరు మోసపుచ్చుతున్నారు. తక్కువ ధరకు వస్తువులు ఇప్పిస్తామని చెప్పి నమ్మించి నట్టేట ముంచుతున్నారు. అందుకే తెలియని వ్యక్తులను నమ్మవద్దని, ఏదైనా ఒకటికి పదిసార్లు పరిశీలన చేసుకున్న తర్వాతనే డబ్బు ఖర్చు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.

స్ఫూప్​ యాప్​తో మోసం : ప్రస్తుత కాలంలో వ్యాపార లావాదేవీలు విపరీతంగా పెరిగిపోయాయి. దీన్నే అవకాశంగా తీసుకొని మోసగాళ్లు మన జేబుకు కన్నం వేస్తున్నారు. ముఖ్యంగా వాణిజ్య, వ్యాపార దుకాణాల్లో డిజిటల్ లావాదేవీలు పెరిగిపోయాయి. ఓ మోసగాడైతే స్ఫూప్ యాప్ నిక్షిప్తం చేసుకుని మోసపూరిత నగదు చెల్లింపులు చేస్తున్నాడు. ఇలా ఆ వ్యక్తి ఒకటికి పదిసార్లు చెల్లింపులు చేసినా, వ్యాపారులు తెలుసుకోలేకపోయారు. ఆ యాప్​లో టిక్​ మార్క్ వస్తుంది. కానీ నగదు మాత్రం బ్యాంకు ఖాతాకు జమ కావు.

వాట్సాప్​లో స్టేటస్​ పెట్టి నష్టపోయిన మహిళలు : మరోవైపు వాట్సప్, ఫేస్​బుక్, ఇన్​స్టాగ్రామ్ ఖాతాల ద్వారా తమ వస్తువులను ప్రచారం చేస్తే నెలకు రూ.వేలు ఇస్తామంటూ కొందరు ఏజెంట్లు మోసపూరిత ప్రచారం చేస్తున్నారు. ఇది నమ్మి చాలా మంది మోసపోతున్నారు. ముఖ్యంగా గృహిణులు లక్ష్యంగా చేసుకొని ఈ దందా చేస్తూ డబ్బు వసూలు చేస్తున్నారు. కేవలం రూ.300 డబ్బులు చెల్లించి వాట్సప్​ స్టేటస్​ ప్రచార పత్రాన్ని పెడితే. నెలకు రూ.10 వేల నుంచి రూ.12 వేలు నేరుగా బ్యాంకు ఖాతాకే జమ చేస్తామని వేలాది మంది మహిళలను కేటుగాళ్లు మోసం చేశారు. ఇలాంటి యాప్​ల వల్ల బ్యాంకు ఖాతాలు ఖాళీ అయ్యే ప్రమాదం ఉందని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

రైతులను కూడా వదలని మోసగాళ్లు : రైతులను కూడా కేటుగాళ్లు మోసం చేస్తున్నారు. తక్కువ ధరకే పురుగుల మందులు, విత్తనాలు ఇప్పిస్తామంటూ తెలంగాణతో పాటు ఏపీలోనూ రైతులను ఓ వ్యాపారి మోసం చేశాడు. ఒక్కో రైతు నుంచి రూ.2 వేల చొప్పున నగదు వసూలు చేసి రూ.లక్షల్లో దోచుకొని ఉడాయించాడు. అలాగే పొట్లం యాప్​ పేరుతో పెట్టుబడులు పెట్టించి రూ.50 కోట్ల లాభాలు వస్తాయని రూ.25 లక్షలు నొక్కేసిన వ్యవహారం ఏపీలోని నరసరావుపేటలో బయటపడింది.

వలపు వలతో తెలుగు యువత విలవిల - ఆ జిల్లాలోనే ఎక్కువ మంది బాధితులు

మీ అకౌంట్​లో డబ్బు జమ అయినట్లు మెసెజ్​ వచ్చిందా? - అది డమ్మీ కావొచ్చు, బ్యాలెన్స్ చెక్​ చేసుకోండి - Dummy Messages Cyber Crime in hyd

ABOUT THE AUTHOR

...view details