తెలంగాణ

telangana

ETV Bharat / state

హైదరాబాద్​లో ఇందిరమ్మ ఇళ్లకు ఆ అర్జీదారులే ఎక్కువ - బహుళ అంతస్తులు కట్టించే యోచనలో సర్కార్! - INDIRAMMA HOUSES UPDATE

గ్రేటర్‌ హైదరాబాద్‌ జిల్లాల పరిధిలో సొంత స్థలం లేని వారికి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై ప్రభుత్వం మల్లగుల్లాలు - బహుళ అంతస్తుల నిర్మాణంపై యోచన

Indiramma Housing Scheme
Indiramma Housing Scheme (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Feb 13, 2025, 8:52 AM IST

Indiramma Housing Scheme : రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఇందిరమ్మ ఇళ్ల పథకంతో పేద ప్రజలకు సొంతింటి కలను సాకారం చేయాలని చూస్తోంది. ఇందుకు అనుగుణంగా అడుగులు ముందుకు వేస్తుంది. 33 జిల్లాల్లోని 32 జిల్లాల్లో ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వడానికి ఎలాంటి భూ సమస్య అనేది రాలేదు. అక్కడ భూమి ఇచ్చి ప్రభుత్వమే ఇంటిని నిర్మించి ఇస్తుంది. కానీ ఆ ఒక్క జిల్లాలోనే ఇందిరమ్మ ఇల్లు పథకం అమలు ఎలా అనేది ప్రశ్నార్థకంగా మారింది. అదే గ్రేటర్‌ హైదరాబాద్‌.

గ్రేటర్‌ హైదరాబాద్‌ జిల్లాల పరిధిలో దరఖాస్తు చేసుకున్న వారిలో ఎక్కువగా సొంత స్థలం లేనివారే ఉన్నారు. రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో మరెక్కడా లేని సమస్య ఇక్కడ 90 శాతం వరకు ఉందని అధికారులు గుర్తించారు. ఈ సమస్యను ఎలా పరిష్కరించాలని అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఇప్పటి వరకు ఇందిరమ్మ ఇళ్ల కోసం గ్రేటర్‌ జిల్లాల నుంచే 10.71 లక్షల దరఖాస్తులు వస్తే అందులో సుమారు 9 లక్షల మందికి సొంత స్థలం లేదు. దీంతో ఇప్పుడు ఇదే పెద్ద సమస్యగా మారింది. దీంతో ఈ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని గృహ నిర్మాణ శాఖ అధికారులు నిర్ణయించుకున్నారు.

ఆర్థిక భారం తగ్గేలా బహుళ అంతస్తులు : స్థలం మంజూరు చేసి ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం చేయడం ప్రభుత్వానికి ఆర్థిక భారమని ఓ ఉన్నతాధికారి అంటున్నారు. దీని కన్నా గ్రేటర్‌ హైదరాబాద్‌ జిల్లాల పరిధిలో అర్హులుగా గుర్తించిన వారిలో ఎక్కువ మందికి సొంత స్థలం లేకపోవడంతో అపార్ట్‌మెంట్ల నిర్మాణం చేపట్టడం ఒక్కటే మార్గమని తెలిపారు. గ్రేటర్ పరిధిలో హౌసింగ్‌ బోర్డుకు చాలా ప్రాంతాల్లో భూములు ఉన్నాయి. వాటిలో కొన్నింటిని గుర్తించి నిర్మాణదారులతో డెవలప్‌మెంట్‌ అగ్రిమెంట్ చేసుకుంటే కొంత స్థలం పేదలకు ఇళ్లు నిర్మించి ఇవ్వవచ్చని అంటున్నారు. మిగిలిన స్థలంలో నిర్మాణదారులకు ఇతర అవసరాలకు ఉపయోగించుకోవచ్చని చెబుతున్నారు. లేదంటే గత ప్రభుత్వం లాగా రెండు పడకల బహుళ అంతస్తులను నిర్మించి ఇస్తే ఆర్థిక భారం తగ్గుతుందని ఓ అధికారి అంటున్నారు.

కసరత్తు - ప్రభుత్వానికి త్వరలో నివేదిక :ఇలా గ్రేటర్​లో సొంత స్థలం లేని దరఖాస్తులను గుర్తించి ఆ అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని ఉన్నతాధికారులు ఓ నిర్ణయానికి వచ్చారు. రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో లేని పరిస్థితులు ఇక్కడ ఉండటంతో ఈ పథకాన్ని ఇక్కడ ఎలా అమలు చేయాలా అనే సందిగ్ధత నెలకొంది. అయితే ప్రభుత్వ మార్గదర్శకాలు లేనిదే ఆయా నియోజకవర్గాల్లో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేయడం కష్టమని ఓ ఉన్నతాధికారి వెల్లడించారు. దీంతో అలాంటి విషయాలను అన్నింటి సేకరించి వివరాలను త్వరలో నివేదిక పంపేందుకు కసరత్తు చేస్తున్నట్లు కూడా తెలిపారు.

ఇందిరమ్మ ఇళ్లు - ఈ కొలతల్లో కడితే రూ.5 లక్షలకు రూపాయి దాటదు!

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు అలర్ట్‌ - ప్రీ-గ్రౌండింగ్‌ సమావేశాలకు ఏర్పాట్లు

ABOUT THE AUTHOR

...view details