Indians In Foreign Prisons: జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలానికి చెందిన ఓ వ్యక్తి యూఏఈలో అక్రమంగా సరిహద్దు దాటుతూ పోలీసులకు చిక్కి జైలు పాలయ్యాడు. సారంగాపూర్ మండలం లచ్చక్కపేటకు చెందిన ఇద్దరు అమాయకులను రాయికల్ మండలానికి చెందిన ఓ ఏజెంట్ మాయమాటలు చెప్పి హైదరాబాద్ నుంచి బ్యాంకాక్ విమానం ఎక్కించాడు. అక్కడి నుంచి మలేసియాకు రోడ్డు మార్గం ద్వారా కొంత దూరం, మరికొంత నడక మార్గం ద్వారా చేర్చారు.
మలేసియాలో ఉపాధి కోసం బస్సు ఎక్కుతున్న అభాగ్యులిద్దరినీ పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు. మేడిపల్లి మండలం మన్నెగూడెం గ్రామానికి చెందిన రాజయ్య రియాద్‌లోని జైల్లో శిక్ష అనుభవిస్తూ అనారోగ్యానికి గురయ్యాడు. చికిత్స కోసం ఆసుపత్రికి తరలిస్తుండగా మృతిచెందాడు. మల్యాలకు చెందిన రాజయ్య అనే మరో వ్యక్తి జైల్లో శిక్ష అనుభవిస్తూ మృతి చెందగా కనీసం మృతదేహం కూడా ఇల్లు చేరలేదు. ఆయన డెత్ సర్టిఫికెట్ మాత్రమే పంపడంతో కుటుంబీకులు కన్నీరుమున్నీరయ్యారు. ఇలాంటి ఘటనలు ఇప్పటికీ టీవీల్లో వింటూ పేపర్లలో చూస్తునే ఉన్నాం.
ఉపాధి కోసం ఊరు వదిలిన అభాగ్యుల్లో చాలా మంది తెలిసో తెలియకో చేసిన తప్పులకు కటకటాల పాలవుతున్నారు. విదేశాల్లోని జైళ్లలో మగ్గుతున్న వారి వివరాలు కావాలంటూ ఇటీవల కొందరు ఎంపీలు పార్లమెంటులో అడగగా విదేశాంగ శాఖ సహాయమంత్రి సమాధానం ఇచ్చారు. ప్రపంచంలోని 89 దేశాల్లో 9వేల521 మంది భారతీయులు జైళ్లలోఉన్నారని వెల్లడించారు. ఇందులో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు ఎక్కువగా గల్ఫ్ దేశాల జైళ్లలో ఉన్నట్లు వివరించారు. అత్యధికంగా సౌదీ అరేబియాలో 2,200, దుబాయ్‌లో 2,143, నేపాల్‌లో 1,227, ఖతర్‌లో 752, యూకేలో 278, అమెరికాలో 170, పాకిస్థాన్‌లో 308 మంది భారతీయ పౌరులు విదేశీ కారాగారాల్లో మగ్గుతున్నారు.
చదువు కెరీర్‌గా, ఆటలు హాబీగా ఎంచుకుని - అంతర్జాతీయ స్థాయిలో అదరగొడుతోన్న స్ఫూర్తి
Indian Prisoners in Foreign Countries :జైళ్లలో ఉన్న ఖైదీలను టీఎస్‌పీ అగ్రిమెంట్ ద్వారా బదిలీ చేయడానికి పలు దేశాలతో భారత్ ఒప్పందం చేసుకుంది. దీని ద్వారా విదేశీ జైళ్లలో మగ్గుతున్న భారతీయులకు కొంత మేర ఊరట లభిస్తోంది. ఒప్పందం కుదుర్చుకున్న దేశాల్లో బంగ్లాదేశ్, ఇరాన్, కజకిస్తాన్, ఖతర్, రష్యా, సౌదీ అరేబియా, టర్కీ, దుబాయ్, యూకే వంటి చాలా దేశాలు ఉన్నాయి. 2006 నుంచి 2022 జనవరి వరకు టీఎస్‌పీ అగ్రిమెంట్ కింద కేవలం 86 మంది మాత్రమే విదేశాల నుంచి భారత్‌కు వచ్చారు. భారత్ నుంచి 11 మంది విదేశీ ఖైదీలను ఆయా దేశాలకు పంపారు.