CM Revanth Reddy Meet With Collectors : సచివాలయంలో జరుగుతున్న జిల్లా కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీచేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతుభరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్ల పథకం పంపిణీ పథకాలు అర్హులకే చేరాలని సూచించారు. ఈనెల 26 నుంచి తాను జిల్లాల్లో ఆకస్మిక తనిఖీలు చేస్తానని తెలిపారు.
ఈ భేటీకి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, సీతక్క, కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావు హాజరయ్యారు. ఈనెల 26 నుంచి ప్రారంభించే రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇండ్ల పథకాల అమలు లబ్ధిదారుల జాబితా తయారీపై ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేస్తున్నారు. జనవరి 26 న రిపబ్లిక్ డే నుంచి ఈ పథకాలను అమలు చేయాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది.
ఈ నాలుగు పథకాల అర్హుల కోసం రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో గ్రామ సభల నిర్వహణ, మున్సిపాలిటీల్లో వార్డు సభలు నిర్వహించేందుకు వెంటనే సన్నాహాలు చేసుకోవాలని కలెక్టర్లను ముఖ్యమంత్రి ఆదేశించారు.
పంట వేసినా, వేయకున్నా రైతుభరోసా ఇవ్వాల్సిందే : ఈనెల 26 తర్వాత జిల్లాల్లో పర్యటిస్తానని, అన్ని జిల్లాల్లో ఆకస్మిక తనిఖీలు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. సాగు యోగ్యమైన భూములకే రైతు భరోసా చెల్లించాలని నిర్దేశించారు. పంట వేసినా, వేయకున్నా సాగుయోగ్యమైన భూమికి రైతుభరోసా ఇవ్వాలని స్పష్టం చేశారు. అనర్హులకు మాత్రం రైతు భరోసా ఇవ్వొద్దని అన్నారు. క్షేత్రస్థాయిలో పర్యటించి అనర్హులను గుర్తించాలని అధికారులకు సూచించారు. సాగుకు అక్కరకు రాని భూములను గుర్తించి రైతు భరోసా నుంచి మినహాయించాలని సూచించారు.
వారి వివరాలు పక్కాగా తయారు చేయాలి : స్థిరాస్తి భూములు, లే ఔట్‌ల వివరాలను ముందుగా సేకరించాలన్న ఆయన నాలా కన్వర్షన్ అయిన భూముల వివరాలు సేకరించాలని అధికారులను ఆదేశించారు. మైనింగ్ భూములు, గోదాములు నిర్మించిన భూములు గుర్తించాలన్నారు. వివిధ ప్రాజెక్టులకు సేకరించిన భూముల వివరాలు సేకరించాలని గ్రామపంచాయతీ, మున్సిపాలిటీల రెవెన్యూ రికార్డులు క్రోడీకరించుకోవాలని పేర్కొన్నారు. గ్రామాల మ్యాప్‌లు పరిశీలించి క్షేత్రస్థాయిలో పరిశీలించి ధ్రువీకరించుకోవాలని సూచించారు. సాగుయోగ్యం కాని భూముల వివరాలు పక్కాగా తయారు చేయాలని అధికారులను ఆదేశించారు.
త్రిబుల్ ధమాకా - ఈనెల 26 నుంచి వారందరికీ డబ్బులే డబ్బులు
ఈ నెల 26 నుంచి రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డుల జారీ
జనవరి 5 నుంచి రైతు భరోసా దరఖాస్తులు స్వీకరణ? - కేబినెట్ సబ్ కమిటీ కీలక నిర్ణయాలు ఇవే